మా అమ్మా వాళ్ళ తాతయ్య
మా అమ్మా వాళ్ళ తాతయ్య
భట్టిప్రోలు విజయలక్ష్మి
వాళ్ళ తాతయ్య గురించి చాలా సంతోషంగా బోల్డు ముచ్చట్లు చెప్పేది. ఆయన రోజూ దొడ్లో వున్నా బాదం చెట్టు ఆకులు కర్రతో దులిపి, ఆ ఆకుల్తో ఇంట్లో అందరికీ విస్తళ్ళు కుట్టి ఇచ్చేవాట్ట. ఒక్కోసారి ఏదైనా పండుటాకు, ఎర్రది రాలితే దానితో విస్తరికి ఓ చెవిలాగా ఎక్స్టెన్షన్ గా కుట్టేవాట్ట. అందరూ ఆ విస్తరి మాక్కావాలంటే మాకని పోట్లాడుకునేవారట. కానీ ఆ పోట్లాటలో ఎప్పుడూ మల్లు మామయ్యే నెగ్గేవాట్ట. వాళ్ళ తాతయ్యే చివరికి 'మల్లుకిచ్చేద్దాంలే' అనేవాట్ట.
అందరూ పొద్దున్నే చద్దన్నాలు ఊరగాయ వేసుకుని తింటుంటే మల్లు మామయ్య మాత్రం స్పెషల్ గా రెండు బంగాళ దుంపలు ఎర్రగా వేయింపించుకుని అందర్నీ ఊరిస్తూ తినేవాట్ట. అమ్మకి అన్నీ గుర్తే, ఆ విశేషాలన్నీ చెపుతూ వుండేది. వాళ్ళ తాతయ్య దీపావళికి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు వుంటే అన్ని గుమ్మటాలు తాటాకులతో తయారు చేసి వాటిల్లో ఆడపిల్లల చేత దీపాలు పెట్టించే వాట్ట. మగపిల్లల చేత దివిటీలు చేసిచ్చి గుండ్రంగా తిప్పమనేవాట్ట.
అమ్మకి వాళ్ళ బామ్మ తెలియదు. వీళ్ళందరికీ బామ్మ అంటే వాళ్ళ సూర్యనారాయణ తాతయ్య భార్య శ్యామలంబామ్మే. వాళ్ళ పెద్ద బాబాయి, రమణారావు బాబాయి, డాక్టర్ బాబాయి గురించి కూడా బాగా చెప్పేది. ఒక్క గోడే అడ్డంగా ఈ రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండేవట.
వాళ్ళ అమ్మ, అంటే మా అమ్మమ్మ, నండూరి లక్ష్మీ నరసమ్మ గారు, ఇంత మంది (పదిమంది) పిల్లల మీద పొదుపు చెయ్యాలని తన రవికలూ అవీ తనే చేత్తో కుట్టుకునేదిట. కత్తెర చాలా ఖరీదని కత్తిపీటతో బట్ట కత్తిరించి మరీ కుట్టుకునేదట. మా బామ్మ కూడా నండూరి వారి ఆడపడుచే. ఆవిడ కూడా చాలా పాతకాలం ముచ్చట్లు చెప్పేది. మా అమ్మమ్మ కజిన్ పేరు కూడా లక్ష్మీ నరసమ్మే, ఇద్దరు అక్కచెల్లెళ్ళూ ఒకే వూరికి కాపురానికి వచ్చారట. ఆరోజుల్లో ఈ ఆడవాళ్ళు, అంటే మా అమ్మమ్మలు, బైటకు ఏ పెళ్లిళ్ళకో వెళ్ళాలంటే మేనా కట్టించుకుని వెళ్ళేవాళ్ళట. ఇది మా బామ్మ విజయరావమ్మ గారు చెప్పేది. ఆవిడని ఆ వూళ్ళో అందరూ వియ్యమ్మగారనేవారు. నాపేరు కూడా బామ్మ, అమ్మమ్మల పేర్ల కాంబినేషన్, విజయ-లక్ష్మి.
ఇంకా మా అమ్మా వాళ్ళింట్లో గోరింటాకు చెట్టు ఉండేదిట. చేతులకి ఎప్పుడూ గోరింటాకు పెట్టుకునేవార్ట. పాత గోరింటాకు రంగు మాయం గానే మళ్ళీ గోరింటాకు పెట్టుకునే వారట. మా తాతయ్య, నండూరి సత్యనారాయణ గారు, అంటే అమ్మా వాళ్ళ నాన్న మాత్రం 'మీ అందరిదీ ఎర్ర గోరింటాకు, నాది తెల్ల గోరింటాకు, నా చెయ్యి చూడండి, ఎలా తెల్లగా పండిందో' అనేవారట తన తెల్ల అర చెయ్యి చూపిస్తూ. సంక్రాంతికి ముందు ధనుర్మాసంలో గొబ్బిళ్ళకి ఆవుపేడ మేము బైట నుంచి తెచ్చుకునే వాళ్ళం. వాళ్ళచిన్నప్పుడు వాళ్ళు బైటకు వెళ్ళకుండానే కరణం గారి పిల్లలకని పాలేళ్ళే తెచ్చి పెట్టేవాళ్లుట. మేం బైట నుంచి ఆవుపేడ, గోరింటాకు తెచ్చుకుంటుంటే నవ్వేది. రథసప్తమికి ఆ ఆవుపేడ పిడకలతో బైట ఎండలో ఆవుపాలతో పరవాన్నం వండేది. చిక్కుడు కాయలతో రధాలు చేసేది. ప్రసాదాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టుకుని తినేవాళ్ళం. భలేగా వుండేది ఆ రుచి. అదే రుచి ఇంట్లో గ్యాస్ స్టవ్వు మీద వండితే వచ్చేది కాదు. నాగులచవితికి చిమ్మిలి, చలిమిడి చేసేది, అద్భుతం గా ఉండేవి అవి. మా కోసమని నాగుల చవితికి ఉపవాసం వుండేది. అన్నట్టు వుపవాసమంటే గుర్తొచ్చింది, మా అమ్మ పుట్టింది మహాశివరాత్రికి. మా నాన్న ఎప్పుడూ మా అమ్మని ఏడిపిస్తూ ఉండేవాడు. అందరూ పుట్టినరోజుకి స్వీట్స్ చేసుకుని తింటుంటే నువ్వు 'పస్తు' అని. ఇంకా బ్రహ్మాండంగా బీరకాయ, సొరకాయ వంకాయ ముక్కల పులుసు అదిరిపోయేట్టు కాచేది. వంకాయ తొడిమ ముక్కలు నాలుగు పక్షాలుగా కోసి పులుసుల్లో వేసి వాటిని 'దేవుడు ముక్కలు' అనేది. పిల్లల చేత అనీ తినిపించటానికి అవి తల్లుల టెక్నిక్కులేమో.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి