ఆదిశంకరుడు-కాలడి నుంచి కేదార్ వరకు
ఆదిశంకరుడు-కాలడి నుంచి కేదార్ వరకు
భట్టిప్రోలు విజయలక్ష్మి
శ్రీ శంకర భగవత్పాదులు పుట్టేనాటికే దేశంలో మతకలహాలు విపరీతంగా ఉండేవి. ఎన్నో మతాలూ, ఎందరో గురువులు, ఎన్నెన్నో మార్గాలు. జనం వీటన్నింటితో విసిగిపోయి వున్నారు. మన భారతీయులందరూ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ సనాతనులే. అది మన ధర్మం, ధార. హిందూ అనే పదం ఆరోజుల్లో లేదు. ఆంగ్లేయులొచ్చిన తరువాత ఈ పదం మన హిందువులకు దాదాపు పర్యాయపదమై పోయింది. మతం అంటే, ఒక గురువు, ఆ గురువు ఆలోచనాధార, ఆ పంథాను అనుసరించే శిష్యులు, అంతే. శంకరులనాటికి హిందూ శబ్దం లేదు. సింధునది మాత్రమే వుంది. మన ఉపఖండంలో వున్న వారంతా భారతీయులే, మనమందరం సనాతనులమే. భారత అంటే, భ-వెలుగులో, రత-రమించేవారని అర్థం. మనది కర్కటరేఖపై వున్న దేశం. సహజంగా సూర్యకాంతి ఎక్కువున్న దేశం. భ అంటే కాంతి, వెలుగు, ప్రభ. మనల్ని కాస్తా అందరూ కలిసి భారత అనే పదానికి అర్థం తెలియక ఇండియన్స్ ని చేస్తే, మనం వారికన్నా కూడా అజ్ఞానంతో ఇప్పటికీ తలలూపుతున్నాం. సరిగ్గా చదివితే, మన భారతదేశ రాజ్యాంగంలో మన దేశం పేరు భారత్ అని మొదటి పేరాలోనే ఉంటుంది. 'ఇండికా' అని మెగస్తనీస్ రాసిన పుస్తకం ఆధారంగా ఆ పదం పుట్టింది. ఆవిధంగానే వెలుగుతో నిండిన, వెలుగులో క్రీడిస్తున్న మన భారతదేశంలో అది శంకరుడు అవతరించాడు.
కాలడి నుంచి కేదార్ వరకు ఆయన ప్రస్థానం ఎలా జరిగిందో కాస్త చూద్దాం. అఖండమైన ప్రజ్ఞ కలిగిన శంకరుడు చాలా చిన్న వయసులోనే ఎన్నో విషయాలు ఆకళింపు చేసుకున్నాడు. ఆ పిన్న వయసులోనే ఆయన చేసిన కొన్ని మహిమలకు ఈనాటికీ సాక్ష్యాలు కనిపిస్తాయి. తల్లి ఆర్యాంబ పూర్ణానదికి నిత్యమూ వెళ్లి స్నానం చేసి నీళ్లు తెచ్చుకునేది. ఒకరోజు తల్లి కష్టం గమనించిన శంకరుడు పూర్ణానదీ మార్గాన్నే తన శక్తితో మళ్లించి ఇంటికి దగ్గరగా ఒక పాయ వచ్చేలా చేసాడు. ఈనాటికీ ఆ రెండు పాయలూ కనిపిస్తాయి. వీరి ఇల్లు దాటంగానే ఆ పాయ తిరిగి మళ్ళీ అసలు ధారలో కలిసిపోతుంది. ఇదంతా ఆయన బలరాముడిలా హలాయుధంతోనో మరో ఇతర ఆయుధంతోనో చేయలేదు. కేవలం నదిని ప్రార్ధించి ఆ మహత్తర కార్యం సాధించాడు. మాతృఋణం తీర్చుకోవటం ఎలాగో చూడండి. శంకరుడు తల్లి మరణించినప్పుడు కూడా వచ్చి తాను సన్యాసి అయినప్పటికీ తల్లికి దహనకర్మ చేసి మాతృఋణం తీర్చాడు. ఈ రెండు సందర్భాలూ కూడా తరువాత ఆయన జన్మభూమిని గుర్తించటంలో శృంగేరీ పీఠానికి యెంత ఉపయోగపడ్డాయో ముందు ముందు చెప్తాను. శంకరుడు గొప్ప యతి, రచయితా, ద్రష్ట, మార్గదర్శి మాత్రమే కాదు, గొప్ప కొడుకు కూడా. ఆయన సాక్షాత్తూ శంకరుడే. అందుకే శంకర శంకర సాక్షాత్ అంటారు. కాలడి శంకరుడే కైలాస శంకరుడు.
ఆ తరువాత జరిగిన మరో సంఘటన, కనకధారను కురిపించటం. ఒక పేద వితంతువు ఇంటికి భిక్షకు వెళ్లిన బాలశంకరుడికి భిక్ష ఇవ్వలేని ఆమె పేదరికం, అసహాయత తెలిసి, అక్కడికక్కడే నారాయణవల్లభ అయిన ఆ శ్రీమహాలక్ష్మిని తన కనకధారాస్తోత్రంతో సంతృప్తి పరచి ఆ ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించాడు. ఆ నదీ పాయ, ఆ ఇల్లు ఈనాటికీ మనం చూడొచ్చు. ఆ ఇంటిని స్వర్ణోత్తుమన, పొన్నోర్కోత్తుమన అనీ అంటారు. మేము మాకాలడి యాత్రలో ఆఇంటికి కూడా వెళ్ళాం. ఆ ఇంటివారికి మనలాంటివారు ఎప్పుడూ వస్తూ ఉంటే ఇబ్బందిగ ఉందో, ఏమో మరి. ఒక పెద్ద వసారా మాత్రం వదిలేసి 'ఇక్కడ మీరు జపం చేసుకోవచ్చు, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు' అని ఒక పేపర్ అంటించి ఉంచారు. ఆ ఒక్క వసారా చాలు, ఆ ఇంటి సౌభాగ్యం వివరించడానికి. అంత అందంగా, అంత అద్భుతంగా వుంది. ఆ వసారా పైకప్పుపై చెక్కిన లక్ష్మీదేవి దారుశిల్పం కూడా జత చేస్తున్నాను చూడండి.
అక్కడ కూర్చుని కనకధారాస్తోత్రం చదువుకున్నా, ధ్యానం చేసుకున్నా. చాలా హాయిగా, ప్రశాంతంగా, తృప్తిగా వుంది. అంతటి ప్రశాంత వాతావరణంలో కాసేపు గడిపినా చాలు. ఒక జీవితకాలాన్ని సరిపడా దివ్యమైన అనుభూతులు మూటకట్టుకుని వెళ్లచ్చు. నిజంగా అక్కడికి వెళ్లగలగటం, ఆ ఇల్లు, వసారా చూడగలగటం మా పూర్వజన్మ సుకృతం, మా పూజాఫలం. బహుశా శంకరులకు నా ఆర్తి అర్థమై ఆ అవకాశం ఇచ్చారేమో. ఆ అదృష్టం కూడా మాకు కొద్ది ప్రయత్నం తరువాతనే సాధ్యపడింది. ఆ శిల్పం, ఆ దివ్యత్వం, ఆ విభూతి, ఆ అమోఘ వాతావరణం సాధారణంగా మనం యెక్కడా చూడలేం.
ఉపనయనం అయిన తరువాత శంకరునిలో వైరాగ్యం మరింత పెరిగింది. తన ఆయుః కాలం తెలిసిన శంకరులు తాను చేయాల్సిన కార్యకమాలన్నీ సజావుగా సాగటానికి తల్లిని ఒప్పించటానికి ఒక చిన్న లీల చేసి, తాను సన్యాసం తీసుకోవటానికి తల్లిని ఒప్పించాడు. ఆతరువాత అంతా శంకరవిజయమే. అప్పటికే దేశంలో వున్న మతాలలో వైదిక ప్రాధాన్యమైన ఆరు మతాలను గుర్తించాడు. ఆ షణ్మతాలే సౌరం, శైవం, శాక్తేయం, గాణాపత్యం, స్కాంధం, వైష్ణవం. కాలడిలో కంచిమఠంవారు కట్టించిన స్మారకం చాలా అద్భుతం, అపూర్వం అద్వితీయం. ఆ ఏడు అంతస్థులూ ఎలాంటివారైనా ఆ చరిత్ర, ఆ విశేషాలూ చిత్రాలు, శిల్పాల ద్వారా తెలుసుకుంటూ సునాయాసంగా ఎక్కి, దిగేయచ్చు. ఆ అనుభూతి న భూతో న భవిష్యతి. షణ్మతాలను ఆరు అంతస్తులలోను, ఈ ఆరింటిని కలిపి శంకరుడు ప్రతిపాదించిన అద్వైతాన్ని ఏడో అంతస్థులోనూ వివరంగా చూపించారు. పక్కనే ఒక శివాలయం కట్టారు. ఆ పక్కనే ఒక శివలింగం పూల చెట్టు వుంది. చెట్టు అనే కన్నా, మహావృక్షం అంటే బావుంటుంది. దాని కాండం నిండా సువాసనలు వెదచల్లుతూ పెద్ద పెద్ద పూలు, ఫిరంగి గుండ్లంత పెద్ద పెద్ద గుండ్రని కాయలు. చూడ్డానికి నయన మనోహరంగా వుండి, వాతావరణానికి ఒకరకమైన దివ్యత్వాన్ని తెచ్చిపెట్టాయి.
కాలడి నుంచి బయలుదేరిన శంకరుడు తాను కాలు పెట్టిన ప్రతిచోటా విజయం సాధిస్తూ, తన అద్వైతాన్ని ప్రచారం చేస్తూ, ఎన్నో దేవాలయాలు సందర్శిస్తూ, శ్రీచక్రాలు ప్రతిష్ఠిస్తూ, ఆసేతుశీతాచలం కాలినడకన తిరిగాడు. తాను కాలు పెట్టిన ప్రతి ప్రదేశంలోనూ తన గుర్తులు వదిలాడు. అందరికీ మార్గదర్శి అయ్యాడు. ప్రస్థానత్రయానికి భాష్యం రాసాడు. ఎన్నో ఎన్నెన్నో స్తోత్రాలు, గ్రంధాలు రచించాడు. ఈ యాత్రల్లోనే తన గురువు గోవింద భగవత్పాదులను కూడా కలిసాడు. మధ్యలో తల్లి తన అవసాన దశలో శంకరుణ్ణి తలచుకోంగానే వెళ్లి తల్లికి దర్శనమిచ్చి ఆమెకు ఉత్తరక్రియలు చేసి తిరిగి వచ్చి మళ్ళీ తన లక్ష్యం గురించి ఆవిరళంగా శ్రమించాడు. మండనమిశ్రుడు, ఉభయభారతి వంటి పెద్ద పెద్ద పండితులను శాస్త్రసంవాదంలో జయించి తన శిష్యులుగా చేసుకున్నాడు. కాలు పెట్టిన ప్రతి చోటా విజయం సాధించాడు. తలపెట్టిన ప్రతి కార్యమూ దిగ్విజయమే. అఖండ భారతాన్నంతా అద్వైతమనే ఛత్రఛాయలోకి తెచ్చాడు. కాశీ పక్కన వున్న సారనాధ్ లో తన ప్రధమశిష్యులైన పద్మపాదాచార్య, హస్తామలకాచార్య, తోటకాచార్య, సురేశ్వరాచార్య లకు మొదటి ప్రవచనం అందించాడు. ఆ తరువాత ఆ నలుగురినీ భారతదేశం యొక్క నాలుగు దిక్కులా తాను స్థాపించిన నాలుగు ప్రధాన పీఠాలకీ పీఠాధిపతులుగా నియమించాడు. వీటినే ఆదిశంకరుని చతురామ్నాయ పీఠాలంటారు. పద్మపాదాచార్యుణ్ణి తూర్పున వున్న పూరీలోని గోవర్ధనమఠానికీ, హస్తామలకాచార్యుణ్ణి పశ్చిమాన వున్న ద్వారకలోని ద్వారకా పీఠానికీ, తోటకాచార్యుణ్ణి ఉత్తరాన ఉన్న బదరి దగ్గర వున్న జోషీమఠ్ లోని జ్యోతిర్మఠానికీ, సురేశ్వరాచార్యుణ్ణి దక్షిణాన వున్న శృంగేరి లోని శారదాపీఠానికీ ప్రధమ పీఠాధిపతులను చేసాడు. మా సుకృతం కొద్దీ మేము ఈ నాలుగు చతురామ్నాయ పీఠాలనూ సందర్శించగలిగాము.
కాశ్మీరంలోని సర్వజ్ఞపీఠంలో సమస్త భారతావని నుంచి వచ్చిన ఉద్ధండ పండితులనందరినీ శాస్త్రచర్చల్లో నిర్ద్వందంగా ఓడించి ఆ సర్వజ్ఞపీఠాన్ని అధిష్టించిన ఏకైక ఆచార్యుడు శంకరుడు. ఆ సర్వజ్ఞపీఠం వున్న ప్రాంతం అంతా దురదృష్టవశాత్తూ ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ లో వుంది. ఆ ప్రాంతంలోనే శంకరుడు అప్పుడే అక్కడే శారదాపీఠం స్థాపించాడు. ఆ ప్రాంతం, ఆ పీఠం, ఆ మందిరం మతదాడుల్లో సంపూర్ణంగా నాశనం అయ్యింది. కేవలం నాలుగు స్తంభాలు మాత్రం మిగిలి వున్నాయి. ఆ చిత్రాలు ఇంటర్ నెట్ లో చూస్తే కన్నీళ్లు వస్తాయి. సాక్షాత్తూ ఆ ఆది శంకరుడే తిరిగి జన్మించి మళ్ళీ తాను యెప్పుడో శతాబ్దాల క్రితం చేసిన పనినే మళ్ళీ చేపట్టాలేమో. ఆసేతుశీతాచలమూ పర్యటించిన శంకరులు తమ నిష్క్రమణ సమయం ఆసన్నమయిందని గ్రహించి కేదారనాథుణ్ణి అర్చించి ఆ ప్రదేశంలోనే తన దండ కమండల కౌపీనాలను విసర్జించి కేదారాన్ని దాటుకుని హిమాలయాల్లో పైపైకి యాత్ర సాగించాడు. ఆయనను అనుసరించ ప్రయత్నించిన శిష్యులను వారించి తానొక్కడే ఆ హిమవత్పర్వత శిఖరాలను అధిరోహించి కనుమరుగయ్యారు. ఆ తరువాత ఆయన మరి ఎవ్వరికీ కనపడలేదు. వారి దేహమూ దొరకలేదు. ఇదీ కాలడి నుంచీ కేదార్ దాకా సాగిన శంకరాచార్యుల జీవితయాత్ర. కేవలం 32 సంవత్సరాల కాలంలో మరి ఏ ఒక్కరికీ సాధ్యం కానంత పని తాను ఒక్కడే చేసి, అందరినీ ఒక్కతాటిమీద నడిపించి తాను సాక్షాత్తూ శంకరుడినే అని అందరూ తెలుసుకునే విధంగా తన జీవన యానాన్ని సాగించారు ఆది శంకరుడు. నమో శంకర భగవత్పాదా, నమో నమః.
కొన్ని వందల, వేల ఏళ్ళు గడిచిపోయాయి. శంకరుని చిహ్నాలుగా కేవలం ఆయన రచనలు మాత్రమే మిగిలాయి. భజగోవింద స్తోత్రంలో 'నహి నహి రక్షతి డ్రుక్కున్కరణే, గోవిందం భజ మూఢమతే' అని చెప్తూ వ్యాకరణం కాదయ్యా, గోవిందనామాన్ని భజించండి అని చెప్పాడు. "తల్లీ, తండ్రీ, సహోదరులు, బంధువులు, దానం, గృహం, ఏవీ కూడా నీవి కావు. నీతో రావు. ఇవి అన్నీ అశాశ్వతాలు. జాగ్రత్తగా వుండు." అంటూ తస్మాత్ జాగ్రత జాగ్రత అని హెచ్చరించాడు. ఆయన చెప్పిన గీతా భాష్యం, ఉపనిషత్తుల భాష్యం, బ్రహ్మ సూత్రాలపై చెప్పిన భాష్యం ఈనాటికీ మనకు మార్గ దర్శకం. కేరళలో శంకరుని జన్మభూమి ఛాయలు రాను రానూ కనుమరుగైయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో దక్షిణామ్నాయ పీఠమైన శృంగేరి నుంచి 1879 నుంచి 1912 వరకూ పీఠాధిపతిగా వున్న శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామివారు ఆదిశంకరుని జన్మభూమిని వెలికి తీయాలనే దృఢ సంకల్పంతో ఎంతో పరిశ్రమ, పరిశోధన చేశారు. ఈ కష్ట సాధ్యమైన కార్యంలో కూడా శంకరుడు చెప్పిన ఒక మాటే సహాయం చేసింది.
శంకరుడు పూర్ణానదీ తీరంలో నివసించేవాడని తెలుసు. తన తల్లితో నిత్యమూ పక్కనే వున్న శ్రీకృష్ణాలయానికి వెళ్ళేవాడని తెలుసు. కన్నతల్లి ఆర్యాంబకు అంత్యక్రియలు చేశాక, ఆమె గుర్తుగా ఒక రాతి స్తంభాన్ని అక్కడ స్థాపించాడు. ఈ గుర్తుల ఆధారంగా శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామివారు ఎట్టకేలకు కాలడిలో, పూర్ణానదీ ప్రవాహం రెండుగా చీలిన ప్రాంతంలో, శ్రీకృష్ణాలయం పక్కన ఒక గ్రానైట్ పిల్లర్ ను కనుగొన్నారు. ఆ పిల్లరే ఆర్యాంబ సమాధి గుర్తుగా నిర్ధారించుకున్న తరువాత ఆ స్థలాన్ని మఠంవారు సేకరించారు. ఆ స్థలంలోనే ఎంతో శ్రద్ధాభక్తులతో ఆనందంగా మళ్ళీ 1910 లో శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రాన్ని పునర్నిర్మించారు. ఆ క్షేత్రంలో ప్రస్తుతం రెండు పీఠాలపై కుడివైపున సప్త మాతృకల ఆలయాన్ని, ఎడమవైపున ఆదిశంకరుని ఆలయాన్ని, మధ్యలో ఆ గ్రానైట్ పిల్లర్ ను అలాగే ఉంచి దాని పక్కనే ఆర్యాంబ గారికి ఒక బృందావనాన్ని నిర్మించారు. సప్త మాతృకలంటే, బ్రాహ్మీ, వైష్ణవి, మాహేశ్వరి, ఇంద్రాణి, కుమారి, వారాహి, చాముండి. వీరు అందరికీ మాతృరూపాలు. ఈ సప్త మాతృకల ఆలయాన్ని సప్త కోణాకృతిలో నిర్మించి ఒక్కో కోణంలో ఒక్కో మాతృక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి, బ్రాహ్మీదేవి ఉన్న కోణంలో గర్భగృహం వచ్చే విధంగా ఆ బ్రాహ్మీదేవినే మూలమూర్తిగా ప్రతిష్ట చేసారు. శృంగేరి వారిది శారదాపీఠం కదా మరి. ఆ శారదాదేవే బ్రాహ్మీదేవి కనుక మూలమూర్తి ఆమెయే.
ఈ కాలడి క్షేత్రాన్ని చూడాలని ఎన్నాళ్లగానో, ఎంతో కోరికగా ఉండేది. ఆది శంకరులు చెప్పిన జగద్గురు బోధలు కంచి పీఠంవారు సాధనా గ్రంథమండలి వారి సహకారంతో ప్రచురించారు. మానాన్నగారు కంచి పరమాచార్యులవారికి భక్తులు. నా చిన్నప్పటినుంచీ వారి ప్రవచనాలను వింటూ పెరిగాను. వారిని ఎన్నిసార్లు చూశానో, వారి బోధలు విన్నానో, వారి చేతి నుంచి తీర్థప్రసాదాలను తీసుకున్నానో నాకు తెలియదు. కొన్ని సంవత్సరాలపాటు ఆ కార్యక్రమం సాగింది. అప్పటినుంచీ శంకరుల జన్మభూమిని చూడాలని మనసులో ఉండేది. ఆ కోరిక తీరేసరికి చాలా ఆనందపడ్డాను. ఆ క్షేత్రానికి రెండు సార్లు వెళ్లగలిగాం. రెండోసారి చాలా అనుకోకుండా ఈ దర్శనం దొరికింది. శబరిమల వెళ్తున్నప్పుడు కొచ్చి నుంచి శబరిమల వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా కళ్లెదురు సాక్షాత్కరించింది. చాలా ఆశ్చర్యపడి లోపలకు వెళ్లి దర్శనం చేసుకున్నాం. ముఖ్యంగా కంచి వారు కట్టించిన స్మారకం ఏడంతుస్థులు ఉండటంతో దూరం నుంచే కనిపించేస్తుంది. అదో వరం.
ఇంతటితో ఈ వ్యాసం ముగిస్తాను. రేపటినుంచీ శివ క్షేత్రాలు రోజుకొకటి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ పైన ఆ శివుడి దయ, నా అదృష్టం. నా శంకర క్షేత్రాల్లో మొదటి క్షేత్రంగా కాలడి శంకరుణ్నే భావించి ముందుగా ఈ వ్యాసం రాస్తున్నాను.
ఓం నమః శివాయ, ఓం శ్రీ ఆది శంకరాయ నమః
ఓం శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వత్యైనమః
ఇక అమరనాథాయనమః అనుకుంటూ హిమాలయ సానువుల్లోని అమరనాథ క్షేత్ర దర్శనాన్ని చేద్దాం.
This comment has been removed by the author.
రిప్లయితొలగించండిchala detail ga baga rasaru aunty
తొలగించండి