త్రికోణేశ్వరం --- ట్రింకోమలై

త్రికోణేశ్వరం --- ట్రింకోమలై 

   భట్టిప్రోలు విజయలక్ష్మి
                                                                                                                                  
                                                                              శ్రీలంక యాత్ర చేయాలని ఎన్నాళ్ళనుంచో కోరిక. పైగా ఆ యాత్ర కూడా షిప్ లో చెయ్యాలని. ఎందుకంటే, సుమారు ఈ పదేళ్లనుంచీ అన్ని రకాల వాహనాలూ ఎక్కాం ఒక్క క్రూయిజ్ తప్ప. అందుకని ఎట్లాగయినా ఈ యాత్ర క్రూయిజ్ లో చెయ్యాలని అనుకున్నాం. ఆ కోరికైతే తీరలేదు కానీ శ్రీలంక ప్రయాణం మాత్రం చేసాం. మేము ఎన్ని యాత్రలు చేసినా ఒక్క ఐదారుసార్లు తప్ప ఎప్పుడూ గ్రూప్ టూర్స్ చేయలేదు. ఆ ఐదారు యాత్రల్లో ఈ శ్రీ లంక యాత్ర ఒకటి. సుమారు ఒక ఇరవై మంది కలిసి ఈ యాత్ర చేసాం. శ్రీలంక యాత్రలో ముఖ్యంగా చూసినవి తిరుకోణేశ్వరం, మున్నేశ్వరం, కాండీ, కటరగమా, అశోకవనం, పక్కనే వున్న గాయత్రీపీఠం, సీత అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం, కొలొంబో, ట్రింకోమలై. మొదట కొలొంబో దగ్గరలో వున్న కలినియాలో విభీషణుడికి లక్ష్మణుడు పట్టాభిషేకం జరిగిన ప్రదేశానికి వెళ్లాం. విభీషణుడికి రాముడు రామేశ్వరంలో పట్టాభిషేకం చేస్తే, లక్ష్మణుడు కలినియాలో చేసాడు. 

                                                          తిరుకోణేశ్వరం ఆలయంలో శాంకరీమాత, తిరుకోణేశ్వరుడు ఈ రెండూ ప్రధానమైనవి. శాంకరీమాత గురించి శక్తిక్షేత్రాల్లో చెప్పుకుందాం. ఈ రెండు ఆలయాలూ ఒకే చోట వున్నాయి, అదే తిరుకోణేశ్వర ఆలయం. తిరు కోణ ఈశ్వర ఈ మూడు పదాలూ కలిస్తే తిరుకోణేశ్వరం. ఈ ఆలయం పోర్చుగీసుల దాడిలో దాదాపు సంపూర్ణంగా నాశనం అయిపోయింది. ఆలయ పూజారులు చేతికొచ్చిన విగ్రహాలను చేతికొచ్చినట్టు సముద్రంలో పారేశారు. కొన్నింటిని భూమిలో పాతేశారు. కొన్ని తీసుకుని బోట్లలో పారిపోయారు. ఆనాటి పురాతన ఆలయంలో మిగిలింది ఒకే ఒక్క స్తంభం. ప్రస్తుతం ఈ స్తంభాన్ని ఒక చిన్న గుట్టమీద పునఃప్రతిష్టించి ఒక పతాకాన్ని ఉంచారు. డచ్చివారు, పోర్చుగీసుల మధ్య జరిగిన యుద్ధాలు శ్రీలంకలో పురాతన సంస్కృతిని చాలా వరకు ధ్వంసం చేశాయి. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినవారిలో చోళులు, పాండ్యులు కూడా వున్నారు. అప్పట్లో ఫోర్ట్ ఫ్రెడరిక్ కట్టుకోవటానికి ఈ ఆలయం ధ్వంసం చేసి ఆ శిధిలాలను కూడా వాడుకున్నారు. ఇప్పటికీ ఈ ఆలయం ఈ ఫోర్ట్ ఫ్రెడరిక్ ప్రాంగణం లోనే వుంది.


       


                                                                          తరువాత కొన్ని విగ్రహాలు సముద్రం నుంచి వెలికి తీసి ప్రతిష్ట చేశారు. వాటిలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శాంకరీదేవి, గణపతి, సోమస్కంధమూర్తి, తిరుకోణేశ్వర ప్రధాన లింగం వున్నాయి. ఈ విగ్రహాలను ఆలయంలో నేటికీ చూడొచ్చు. ట్రింకోమలై లోని ఫోర్ట్ ఫ్రెడరిక్ లోని ఈఆలయంలో 11 ఏళ్లకు ఒకసారి మహా కుంభాభిషేకం , తైలాభిషేకం జరుగుతాయి. ఈ తైలాభిషేకం సమయంలో ఎవరైనా సరే, అన్ని విగ్రహాలనూ, మూలమూర్తులను కూడా తాకి తైలం అద్దవచ్చు. మా టూర్ కూడా ఈ విశేషం జరిగే సమయం లోనే ప్లాన్ చేసి తీసుకునివెళ్ళారు. అన్ని విగ్రహాలనూ, సుమారు 32 విగ్రహాలను తాకి విగ్రహం మొత్తం తైలం పూసి, దణ్ణం పెట్టుకుని వచ్చాం. నూనె వల్ల ఎవరికీ కాళ్లు జారకుండా ఆలయం మొత్తం ఊక పోశారు. దాని మీంచే నడిచివెళ్లాం. అడుగు అడుక్కీ ఈ ఆలయం గోడలనిండా ఈ ఆలయ చరిత్ర, ఆనాటి విధ్వంసం తాలూకు వర్ణ చిత్రాలు పెయింట్ చేయబడి వున్నాయి. ఆలయం అంతా చక్కని వర్ణ చిత్రాలతో అద్భుతంగా, నయన మనోహరంగా వుంది. ఆలయం ఒక కొండ మీద వుంది. మలై అంటే తమిళంలో కొండ అని అర్థం. కొండ ఎక్కంగానే, ముందుగా సుఖాసనంలో కూర్చుని వున్న శివుడి పెద్ద శిల్పం ఒకటి దర్శనమిస్తుంది. ఆ శివుడ్ని చూడంగానే మనసు నిండి పోతుంది.   
  

   


                                         ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసం , తెన్ కైలాసం అని కూడా అంటారు. మన తెలుగులో మనం మర్చిపోయిన మాట తెన్ అనేది. మనకి ఇప్పటికీ కుర్తాళం దగ్గర తెన్ కాశీ, టెంకాశీ కనపడుతుంది. తెన్ అంటే దక్షిణం అని. ఈ దక్షిణ కైలాస శిఖరాన్నే రావణుడు పెకలించబోయింది. రావణుడు తన తల్లి కైకసి కోసం శివుడ్ని తీసుకెళ్ళటానికి ఈ కొండని అమాంతంగా ఎత్తుకుని వెళ్లాలనే  దుస్సాహసం చేస్తాడు. అప్పుడే శివుడు  తన కాలివేలితో  కొండను తొక్కిపెడితే, అతడు రావణంగా, పెడబొబ్బలు పెట్టాడనే అతనికి రావణుడు అని పేరు వచ్చింది. తల్లిదండ్రులు అతని పెట్టిన పేరు దశకంఠుడు. ఈ ప్రయత్నం లోనే పేగులతో రుద్రవీణను తయారు చేసి స్తోత్రం చేస్తాడు. అప్పుడు అతని చేతిలో నుంచి జారిపడిపోయిన కత్తితో ఆ కొండలో ఒక పెద్ద కట్ ఏర్పడుతుంది. దానినే రావణాస్ కట్ అంటారు. కింది ఫొటోలో కనిపించేది అదే. ఇక్కడ ప్రతి శివాలయంలోనూ శివుడికి రావణ వాహనం కనపడుతుంది. ఈ టూర్లో ఒక పెద్ద ప్రతిబంధకం భాష. మాకు తమిళం రాకపోవటం వల్ల ఇబ్బంది అయ్యింది. పురాతన ఆలయంలోని ఆ ఒక్క మిగిలిన స్తంభం చూపించమని ఎందర్ని అడిగినా అర్థం కాలేదు. చివరకు నేనే గుడి అంతా తిరిగి వెతికి పట్టుకుని అందరికీ చూపించా. ఇతర ఇబ్బందులు అయితే  తక్కువే. అన్నిటిలోకి ఈ ఆలయమే ప్రధానమైనది కావటంతో, పైగా కుంభాభిషేకం సందర్భంగా తైలాభిషేకం కూడా తైలాభిషేకం కూడా చేసుకునే సౌకర్యం వుండటంతో దాదాపు ఆ రోజంతా అక్కడే గడిపాము. 


    

          
                                                                               ఆ తరువాత శివాలయాల్లో చెప్పుకోదగ్గది రావణ, కుంభకర్ణ వధానంతరం చెల్లాలో శ్రీరాముడు ప్రతిష్టించిన రామలింగేశ్వర శివలింగం. ఆ గుడిలోనే పక్కనే వున్న రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ  గుడిలోనూ అంతే, అంతటా కన్ను తిప్పుకోనివ్వని చక్కని రమణీయమైన వర్ణచిత్రాలు. మరొక ఆలయం మున్నేశ్వరంలో వున్న రాముడు ప్రతిష్టించిన మరో శివాలయం కూడా చూసాం. ఆ ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఎంట్రన్సు లోనే వున్న స్కంధమూర్తి పెద్ద విగ్రహం. యెంత బాగుందో. అనురాధపురలో బోధగయ నుంచి అశోకుడి కుమార్తె సంఘమిత్ర ఒరిజినల్ బోధివృక్షంలోని కొమ్మను తెచ్చి పెంచిన మహాబోధి వృక్షాన్ని చూసాం. దానికి అక్కడి బౌద్ధులు ఇస్తున్న శ్రద్ధ, మర్యాద చూస్తే చాలా ముచ్చటేసింది. ఆ చెట్టుకి నీళ్లు పోయాలంటే పక్కనే ఉంచిన ఒక నీళ్లతొట్టెలో నుంచి అక్కడే వున్న ఒక చెంబుతో నీళ్లు తీసుకుని చెట్టు గట్టు మీద పెడతారు. ఆ చెట్టు సంరక్షకులు చెట్టుకి నీళ్లు పోయాల్సిన సమయంలో ఈ నీటిని పోస్తారు. అంతేకానీ, ఎవరికి తోచినట్లు వాళ్ళు నీళ్లు పోసేయరు. ఆ చెట్టుని అంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. మన దగ్గర బోధివృక్షం ఒకసారి పూర్తిగా చనిపోతే ఇక్కడి నుంచే ఒక కొమ్మ తెచ్చి తిరిగి ఆ బోధివృక్షాన్ని బతికించి పెంచుతున్నారని మాకు బోధగయలో చెప్పారు. 


                     File:Lingam installed at the outer walsl of Sivan temple.jpg              

                                                   
                                                                             ఈ సింహళీయులకు సుబ్రహ్మణ్యుడంటే ఎంతో భక్తి, ప్రేమ. ఇక్కడ సుబ్రహ్మణ్యుడికి చాలా ఆలయాలు వున్నాయి. వాటిల్లో  ఎంతో ప్రత్యేకమైన ఆలయాలు కూడా వున్నాయి. కటరగమా అనే వూళ్ళో వున్న ఆలయంలో ఒక తమాషా ప్రత్యేకత వుంది. అసలు మూలమూర్తిని ఎవరూ చూడరు, చూడనివ్వరు. ఒక మంజూషలో, అంటే ఒక పెట్టెలో, సుబ్రహ్మణ్య యంత్రం ఉంటుందిట. కనీసం ఆ పెట్టె కూడా మనకు చూపించరు. హారతి సమయంలో ధర్మకర్త, పూజారి తెర వెనుకకు వెళ్లి పూజ చేసి వచ్చి మాకు ఆ హారతి చూపించారు అంతే. ఆ తెర మీద వున్న వల్లీ దేవసేనా సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యుడు మాత్రం మహాద్భుతంగా వెలిగిపోయాడు. ఆ తెరే మనకు దేవుడు, దాన్నే దర్శనం చేసుకోవటం, అంతే. కాసేపు విస్తుపోయినా, తరువాత నవ్వేసుకున్నాం. నిరాకార పూజలో ఇదో భాగం అనుకుని. ఆ తరువాత అమ్మవారి ఆలయంలోనూ అంతే, తెర పైనే దర్శనం. అమ్మవారు యెంత బాగుందో. అందం అంటే ఆవిడదే. సౌందర్యలహరి రాస్తే ఆవిడ మీదే రాయాలి మరి. కటరగమా ఆలయంలో ఒక్క బాలసుబ్రహ్మణ్యుడిని మాత్రమే విగ్రహరూపంలో చూపించారు. ఆయన్ని కూడా చాలాసేపు తెర వెనుకే ఉంచి ఒక్క హారతి సమయంలో మాత్రం తెర తీసి స్వామిని చూడనిచ్చారు. ఆ బాలసుబ్రహ్మణ్యుడు కూడా యెంత బాగున్నాడో, సాత్వికమైన అందం అది. తలపై రుద్రాక్షలు, వంటిపై కౌపీనం మాత్రం ధరించి భలే ముద్దుగా, ముచ్చటగా వున్నాడు.  


       

                                           
                                                                          ఆ తరువాత మా యాత్రలో భాగంగా బుద్ధ దంతం వున్న మ్యూజియం, గాయత్రీపీఠం, అశోకవనం, సీతా అగ్ని ప్రవేశం, రామ్ బోడా లోని హనుమాన్ మందిరం చూసాం. కొలొంబోలో కూడా హనుమంతుడి మందిరం చూసాం. వాళ్ళ స్వర్ణ లంకను కాల్చేశాడని ఈ సింహళీయులకు మాత్రం హనుమంతుడంటే గిట్టదు. అందువల్ల శ్రీలంకలో హనుమకు ఆలయాలు తక్కువే. అశోకవనం దగ్గర హనుమ కాల్చేసిన కొండ ప్రాంతం ఇప్పటికీ నల్లగా వుండి అక్కడ ఏ మొక్కా పెరగదు. ఆ పక్కనే హనుమంతుడు తన విరాట్ రూపంలో దూకినప్పుడు ఏర్పడిన పెద్ద పెద్ద పాదముద్రలు వున్నాయి. విభీషణుడంటే మాత్రం వీరికి అపారమైన భక్తి, గౌరవం. ఆయన్ని షన్నో అని సంబోధించారు అందరూ. ఇక్కడ అన్ని దేవతా మూర్తులు తెరల మీదే ఉంటాయి. హారతి సమయాల్లో మాత్రం కొన్నింటిని చూడనిచ్చారు. ఏ దేవుడైనా సుబ్రహ్మణ్యుడి తరువాతే. శివుడు, పార్వతీ కూడా పూజనీయులే వీరికి. సిగిరియా దగ్గర వున్న ఒక పెద్ద పర్వత శకలం చూసాం. దానిపైనే రావణుడి కోట కూడా ఉందట. చాలా పెద్ద ఏక శిల అది. పైకి వెళ్లొచ్చు కానీ చాలా ఎత్తు, ప్రమాదకరమైన దారి, మెట్లు. అది సంజీవని పర్వతం ముక్క అని కూడా చెప్పారు. ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ఔషధ మొక్కలు బాగా దొరుకుతాయని చెప్పారు. శ్రీలంకలో ఒకసారి సముద్ర స్నానం చేసాం. ట్రింకోమలై లో రావణుడు తన తల్లి కోసం తవ్విన ఏడు బావుల్లోనూ స్నానం చేసాం. అవి అన్నీ వేడి నీటి బావులు. వాటిని కన్నియ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అంటారు.


  Image result for how many wells did ravana's dig in trincomalee


                                                                     శ్రీ లంకలో ఒక పెద్ద బొటానికల్ గార్డెన్ చూసాం. అక్కడ ఔషధాలు కూడా అమ్ముతున్నారు. మావారికి కాళ్ల నొప్పంటే వాళ్ళు తాము తయారు చేసిన తైలాలతో మసాజ్ చేశారు. టీ ఫ్యాక్టరీ చూసాం. టీ పాకెట్లు కొనుక్కున్నాం. పిన్నావాలా అనే చోట సబరగమువా అనే అనాధ ఏనుగులను పెంచే శరణాలయానికి వెళ్ళాం. అక్కడ ఏనుగులని చాలా ఆప్యాయంగా చూస్తున్నారు. చనిపోయిన ఏనుగుల చర్మం, దంతం తో వస్తువులు తయారు చేసి అమ్ముతున్నారు. ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ ఆ శరణాలయానికే ఖర్చు పెడుతున్నారు. నేను ఒక హ్యాండ్ బాగ్ కొన్నాను అక్కడ. ఆ తరువాత ఆ బాగ్ ఎన్ని ఊళ్ళు తిరిగిందో మాతో పాటు. ఆ ఏనుగు లన్నింటినీ లైన్లో తీసుకెళ్లి ఓ పెద్ద నదిలో స్నానాలు చేయించి మళ్ళీ లైన్లో తీసుకు వచ్చి వాటిని షెడ్ లలో పెట్టి తిండి పెడుతున్నారు. వందల సంఖ్యలో వున్నాయి ఏనుగులక్కడ. ఆ లైన్ చూస్తుంటే ఎంతకీ తరగదు.





                                                                  యెంత చూసినా, ఏమి చూసినా ఇంకా ఇంకా  చూడాలనిపించే ప్రకృతి. స్వచ్ఛమైన గాలి, నేల, నీరు. తమిళం వచ్చినవారికి ఇంకా బాగుంటుంది. అక్కడ కొన్ని చోట్ల మాత్రం ఇంగ్లీష్ బోర్డులు పెట్టారు. అన్ని చోట్లా పెడితే బాగుండుననిపించింది. ఈపాటికే చాలా రాసాను, ఎన్నో వదిలేసాను. అన్నీ రాస్తే, ఇదే ఒక గ్రంథమైపోతుందని భయం. దక్షిణ కైలాసం, ట్రింకోమలై లోని త్రికోణేశ్వరుడిని చూసాం కదా, శాంకరీ దేవి గురించి శక్తిపీఠాల్లో తెలుసుకుందాం. రాముడు ప్రతిష్టించిన రామలింగేశ్వరుడిని చూసాం. సుబ్రహ్మణ్యుడి ఆలయాలు చూసాం.  మొత్తానికి మా శ్రీ లంక యాత్ర చక్కగా ముగిసింది. 
ఓం శ్రీ త్రికోణేశ్వరాయనమః, ఓం శ్రీ రామలింగేశ్వరాయనమః 

ఓం శ్రీ సుబ్రహమణ్యస్వామినేనమః  

తరువాత నేపాల్ లోని ఖాట్మండులో వున్నఓం శ్రీ పశుపతినాథాయనమః అనుకుంటూ పశుపతినాథుడ్ని సందర్శిద్దాం. 


కామెంట్‌లు

  1. Srilanka yatra vandana adbhutam..chaala vishayaalu ponduparachaaru..

    రిప్లయితొలగించండి
  2. థాంక్స్ అండీ. ఇంకా ఎన్నో రాయాలని వున్నా, ఎక్కువ రాసిన కొద్దీ ఆసక్తి పోతుందని నాకు నేనే లిమిట్ చూసుకుని రాస్తున్నా. మొత్తం బ్లాగ్ పోస్ట్ లు అన్నీ చదివి మీ అభిప్రాయం రాస్తే చాలా సంతోషం. అలాగే ఈ బ్లాగ్ ను మీరు మీ ఇతర స్నేహితులతో కూడా షేర్ చేసుకోవచ్చు. నమస్కారం.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా అమ్మ

99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ