వారాణస్యాం తు విశ్వేశం
9. వారాణస్యాం తు విశ్వేశం......
భట్టిప్రోలు విజయలక్ష్మి
కాశీ, వారాణసి, బెనారస్, అవిముక్త క్షేత్రం, ఆనందవనం ఈ పేర్లన్నీ ఈ నగరానివే. 'క' అంటే శివుడు. కనుక ఇది శివపురి, శివ ధామం. ఇక్కడ అంతా శివమయం. పుట్టెడు ధాన్యం తీసుకుని వెళ్లినా, కాశీలో ఒక్కొక్క లింగం ముందు ఒక్కొక్క గింజ పెడితే, లింగాలే మిగిలిపోతాయి కానీ ధాన్యం చాలదు అని ప్రతీతి. నిజ్జంగా నిజం అంతే. మేము ఈ క్షేత్రానికి నాలుగు సార్లు వెళ్ళాము. బొకారో నుంచి ఒకసారి, హైదరాబాద్ నుంచి మూడు సార్లు. ఒక సారివెళ్ళినప్పుడు లక్షవత్తుల నోము నేను కాశీలోనే చేసుకున్నాను. చాలా బాగా జరిగింది. మరోసారి వెళ్ళినప్పుడు 12 రోజులున్నాము. ఎన్నెన్ని అనుభవాలు, అనుభూతులు కాశీతో పెనవేసుకుని ఉన్నాయో మాకే తెలుసు. అక్కడి గల్లీ గల్లీ, చెట్టు పుట్ట, గుడీ గోపురం ఎన్నెన్నితిరిగామో, ఎంతెంత తిరిగామో మాకే తెలుసు. యెంత నడిచామో, ఎన్ని సార్లు రిక్షాలు, ఆటోలు, పడవలు ఎక్కి దిగామో మాకే లెక్క లేదు. ఇప్పుడు ఈ క్షేత్రం గురించి వ్రాయాలంటే, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనేది ఒక పెద్ద ప్రశ్న నాకు. చూద్దాం, ఏమేమి చెప్పగలనో, విశ్వనాథుడు ఏమేమి చెప్పిస్తాడో. ఆ విశ్వేశ్వరునికి నమస్కరించి ప్రారంభిస్తాను. ఓం నమో విశ్వేశ్వరాయనమః. మొదటగా ఈ క్షేత్రం గురించి ఆది శంకరాచార్యుల శ్లోకంలో ఏముందో చూద్దాం.
సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||
కాశీలో ఎక్కడికి వెళ్లినా ప్రతిసారీ సంకల్పంలో ఒక శ్లోకం చెప్తారు. ఆశ్లోకం ఇదీ. ఈశ్లోకం ద్వారా కాశీలో వున్న ప్రముఖస్థానాల పేర్లు తెలుస్తాయి. వీటన్నింటి గురించి ముందు ముందు ఒక్కొక్కటీ తెలుసుకుందాం.
విశ్వేశం మాధవం డుంఢిమ్, దండపాణించ భైరవం|
వందే కాశీమ్ గుహాం గంగాం, భవానీం మణికర్ణికాం ||
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవంతికా
పురీ ద్వారవతీ జ్ఞేయా సప్తై తా మోక్షదాయకాః
కాశీకి రాంగానే ముందు సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళటం ఒక అలవాటు. కానీ పై శ్లోకంలో డుంఢి గణపతి గురించే చెప్పారు. ఇంకో గణపతి చింతామణి గణపతి. సాక్షి గణపతి, డుంఢి గణపతి విశ్వనాథ మందిరం పక్కనే ఉంటే, చింతామణి గణపతి మందిరం మాత్రం అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా ప్రాచీన మందిరం. సాక్షి గణపతి, డుంఢి గణపతిలవి దేవాలయాలనే కంటే, చిన్న వైశాల్యంతో వున్న మంటపాలనచ్చు. విగ్రహాలు మాత్రం శతాబ్దాల పురాతనమైనవి. దగ్గరకు వెళ్తే వాటి శక్తి మనం కూడా ఫీల్ అవుతాం. దండపాణి ఆలయం కూడా చాలా పురాతనమైనది. ఈయన ఇక్కడ కొత్వాలు లాంటి వాడు. వెళ్లిన భక్తులను దండంతో అక్కడ కొడుతూ వుంటారు, నెమ్మదిగానే అనుకోండి.
తప్పనిసరిగా దర్శించవలసిన మరో ఆలయం కాలభైరవ ఆలయం. ఈ కాలభైరవుడి ఇక్కడి క్షేత్రపాలకుడు. ఈ ఆలయంలో కూడా మద్యం ఛాయలు కొంచం కనపడతాయి. కాశీదారాలు కట్టేదిక్కడే. కుక్కలు, అవీ, నల్లకుక్కలు చాలా కనపడతాయి. ఈ కాలభైరవ ఆలయానికి దగ్గరలోనే మృత్యుంజయ ఆలయం ఉంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే, అకాలమృత్యువు రాదనేది ఒక విశ్వాసం. ఈ మృత్యుంజయ ఆలయం ప్రాంగణం లోనే పురాతన ఆలయాలు చాలా కనపడతాయి. దీన్ని ఒక ఆలయం అనే కన్నా, ఆలయాల సముదాయం అంటే చక్కగా సరిపోతుంది. ఇక్కడే మనకు ధన్వంతరి బావి కనపడుతుంది. బావిలో నుంచి నీళ్లుతోడి, గ్లాసుల్లో పోసి ఇచ్చేవారుంటారు. ఆ నీళ్లు తాగితే ఏ రోగాలూ రావనీ, రోగాలు వున్నా పోతాయని ఒక నమ్మకం. అక్కడ వరండాల్లో పడుకుని, అక్కడే ఉండిపోయేవాళ్లు కూడా చాలామంది కనపడతారు. మాకు అక్కడ ఒక పెద్దాయన కనపడి ఏయే ఆలయాలకు ఎలా వెళ్ళాలో దారి చెప్పాడు. తాను కాశీలోనే వుండి జపం, తపం చేసుకోవటానికి వచ్చాట్ట. చాలా తపశ్శక్తి ఆయనలో కనిపించింది.
మరొక చక్కని ఆలయం సంకటమోచన్ హనుమాన్ మందిరం. చాలా మహత్తు గల దేవుడని చెప్తారు. విగ్రహం మాత్రం చాలా ప్రిమిటివ్ దని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నిరంతరం పూజలు జరుగుతూనే ఉంటాయి. తులసీదాసమందిరానికి కూడా సాధారణంగా అందరూ వెళ్తూ వుంటారు. తులసీదాస్ ఇక్కడే రామచరితమానస్ రాసాడని అంటారు. సంకటమోచన్ ఆలయంలో వున్న రామాలయంలో రాముడు కనపడే విధంగా కూర్చుని తులసీదాస్ రాసాడని అంటారు. ఈయన పేరుతో తులసీఘాట్ కూడా వుంది. మరొక ఆలయం గవ్వలమ్మ ఆలయం. ఈ దేవతనే కౌడీబాయ్ అనికూడా అంటారు. చాలా చిన్న ఆలయం. అక్కడి పురోహితులు దళితులు. ఈదేవతను విశ్వనాథునికి చెల్లెలని చెప్తారు. అక్కడ గవ్వలు వేసి మన యాత్రాఫలితం చెప్తూ వుంటారు ఆ పురోహితులు. ఒక్కోసారి ఒక్కోరకంగా చెప్పటం నేను స్వయంగా చూసాను. అందుకే గవ్వలు సరదాగా వేస్తే వేయించుకోండి కానీ, సీరియస్ గా కాదు.
ఇక్కడి గంగానది కాశీ పొడవునా పారుతూనే ఉంటుంది. గంగానది పొడవునా ఘాట్స్ వున్నాయి. వరుణ, అసి నదుల సంగమం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడి ఘాట్ లు వరుణాఘాట్ తో మొదలెడితే, అస్సీఘాట్ తో ముగుస్తాయి. ఈ ఘాట్లలో కొన్ని ముఖ్య ఘాట్లున్నాయి. ఆ ఘాట్లలో తప్పకుండా స్నానం చేయాలని అంటారు. అవి అస్సీఘాట్, దశాశ్వమేధఘాట్, మణికర్ణికాఘాట్, పంచగంగఘాట్, ఆదికేశవఘాట్. ఉదయం అస్సీఘాట్ లో గంగాహారతి చేస్తారు. కళ్ళకు హాయిగా ఉంటుంది. అలాగే సాయంత్రం దశాశ్వమేధఘాట్, మణికర్ణికాఘాట్ లలో కూడా చేస్తారు. మేము ఈహారతులను ఒడ్డుమీద కూర్చునీ చూసాము. నదిలో నుంచి పడవలో కూర్చునీ చూసాము. ఆ హారతులను చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు. మేము కళ్లజోళ్లు పెట్టుకుని నాలుగేసి కళ్లతో చూశామనుకోండి.
ఇక్కడ కాశీలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా, వాళ్ళు మరే ఇతర పుణ్యక్షేత్రం చూడాలంటే కాశీ వదిలి బయటకు వెళ్లకుండా అన్ని క్షేత్రాలూ కాశీలోని ఉండేలా వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల కాశీలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలూ, ద్వాదశ ఆదిత్యులు, వగైరా అన్ని ధామాలూ ఇక్కడే ఉన్నాయి. మేము కూడా కాశీలో కొన్ని ఆదిత్య ఆలయాలూ, కొన్ని శక్తిపీఠాలూ, కొన్ని దశమహావిద్యలు, అన్ని జ్యోతిర్లింగాలూ చూశాం. అన్నపూర్ణ ఆలయం విశ్వనాథుని మందిరం దగ్గరలోనే ఉంటుంది. ఆ మందిరం లోనే వెనుక వైపు వున్న భాగంలో చాలా ఆలయాలు వున్నాయి. అందులో ఒక వుపాలయం శ్లోకంలో చెప్పిన భవానీ అమ్మవారిది. మొత్తం కాశీలో ఇక్కడ ఒక్కచోటే భవానీ అమ్మవారు వున్నది. ఆ తరువాత ఈ ఆలయంలోనే ప్రదక్షిణా మార్గంలో చక్రేశ్వరస్వామి లింగం వుంది. ఆ లింగంపై శ్రీచక్రం లిఖించబడి ఉంటుంది. దానికి మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇటువంటి లింగం మేము చూసింది ఇదొక్కటే.
లోలార్క
ఈ అన్నపూర్ణ ఆలయం లో మన తెలుగువారే కాశీ అన్నపూర్ణ అన్నదాన ట్రస్ట్ నడుపుతున్నారు. అక్కడ ఉచితంగా రెండు పూటలా వచ్చిన వారందరికీ భోజనం పెడతారు. కింద కూర్చోలేని వారికి టేబుల్ మీల్స్ కూడా వున్నాయి. మేము చాలాసార్లు అక్కడ అన్నదానం కోసం పే చేసాం. దాన్ని ప్రసాదంగా భావిస్తూ భోజనం కూడా వెళ్లిన ప్రతిసారీ కనీసం ఒక్కసారైనా చేస్తాం. చాలా మంచి శుభ్రమైన భోజనం పెడతారు. ఈ అన్నపూర్ణ ఆలయానికి, విశ్వేశ్వర ఆలయానికీ మధ్యలో శనైశ్చర ఆలయం వుంది. ఇంకా చాలా ఇతర మందిరాలు కూడా ఈమధ్యలో కనపడతాయి. ఇక్కడ అడుగుకు ఒక దేవాలయం ఉంటుంది. త్రైలింగస్వామి మఠం లేదా ఆశ్రమం కూడా చెప్పుకోదగ్గదే. ఈ త్రైలింగస్వామి మన తెలుగువారే. ఈయన 280 ఏళ్ళు బతికాడని ఆశ్రమం రికార్డుల్లో వుంది అన్నారు. ఆయనది చాలా భారీ శరీరం. గంగలో ఆయనకు దొరికిన ఒక అతి పెద్ద లింగాన్ని గంగాఘాట్ నుంచి సుమారు రెండు మూడొందల అడుగుల ఎత్తుకు భుజం మీద మోసుకుని వచ్చి తన ఆశ్రమంలో ప్రతిష్ట చేసాడు. ఆ లింగం మనం ఈ నాటికీ చూడొచ్చు. బహుశా ఈ సంఘటన రాజమౌళికి నచ్చి బాహుబలిలో ఒక పెద్ద లింగాన్ని హీరో భుజాల మీద ఎత్తి తీసుకువచ్చినట్టు చూపించారేమో అనిపించింది.
ఇక్కడ వున్న శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారిది. ఈ పీఠం గురించి మన శక్తిపీఠాల శీర్షికలో చెప్తాను. ఇక్కడ మరొక దివ్యమైన ఆలయం వుంది. అది వారాహీ ఆలయం. అది భూగర్భంలో ఉంటుంది. ఈ ఆలయం పొద్దున్న మాత్రమే తెరుస్తారు. అదీ ఉదయం 8, 9 గంటల వరకే. ఆ అమ్మవారు గ్రామ దేవత, రాత్రి అంతా గ్రామసంచారం చేసి ఉదయాన్నే పడుకుంటుంది అని నమ్మకం. నైట్ షిఫ్ట్ అన్నమాట. పొద్దున్నే పూజారులు ఆలయంలో పూజ చేసి బయటకు వచ్చేస్తారు. మరెవ్వరికీ ఆలయ గర్భగృహంలోకి ప్రవేశం లేదు. మనలాంటి వారందరూ కిందనున్న రెండు రంధ్రాల ద్వారా అమ్మవారిని చూస్తాం. ఆ వారాహీ అమ్మవారు వుగ్రదేవత అనీ, అందుకే ఈ ఏర్పాటు చేశారు అని చెప్తారు. ఇక్కడ మరో శక్తి కూడా జన్మించింది. ఆమే మణికర్ణిక, రాణి ఝాన్సీలక్ష్మిబాయి. ఈ మధ్యనే ఆమె మెమోరియల్ ఒకటి ఏర్పాటు చేసి చక్కగా నడుపుతున్నారు. అది కేదార్ ఘాట్ దగ్గరలోనే వుంది.
మరో విషయం ఇది మన భారతరత్న బిస్మిల్లాఖాన్ గారి వూరు కూడా. ఆయన పుట్టి పెరిగిందిక్కడే. ఆయన ముస్లిం అయినా రోజూ గంగా స్నానం చేసి అక్కడికి దగ్గరలో వున్న బాలాజీ ఆలయం ముందు కూర్చుని రోజూ షహనాయ్ వాయించే వారు. ఒకరోజు ఆయన అలా వాయిస్తుంటే సరస్వతీదేవి తెల్లనివస్త్రాలు ధరించి వచ్చి ఆశీర్వదించిందిట. ఆ తరువాత ఆయన ఇంకా ఇంకా సాధన చేసాట్ట. అన్య మతస్థుడని గుడిలోకి రాకూడదని గుడి వాళ్ళే ఆయన కోసం పక్కనే ఒక గది కేటాయించారు. ఆయన అక్కడ కూర్చుని నిత్యమూ దేవుడికి షహనాయి సేవ చెసేవాడుట. సుర్ సే సరస్వతీ అని అనేవాట్ట. ఈ విషయాలన్నీ వారి పెద్దబ్బాయి మాకు చెప్పాడు. కానీ దురదృష్టకరంగా బిస్మిల్లాఖాన్ గారి తరువాత ఆ ఇంట్లో మరెవ్వరికీ ఆయన సంగీత వారసత్వం రాలేదు. మేము ఆయన ఇంటికి కూడా వెళ్ళాం. కానీ అప్పటికి ఆయన లేరు. ఆయన పెద్దకొడుకు వున్నారు. ఆ ఇంట్లో అప్పుడు కూడా పాతిక మంది బంధుజనం ఉన్నారు. బిస్మిల్లాఖాన్ గారు వుండే రోజుల్లో అయితే వందమందికి పైగా ఉండేవారట. మేము రెండోసారి వెళ్ళినప్పుడు ఆ పెద్దకొడుకూ లేడు. ఆయన కొడుకూ, మేనల్లుడూ వున్నారు.
బిందుమాధవుడు, ఆదికేశవుడు ఇక్కడి వైష్ణవ దేవతలు. అవి కూడా చూసాం. అన్నిచోట్లా శక్తిమేరకు అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చనలు చేసాం. ఇక్కడ జంగంవాడి మఠంలో శైవ భక్తులకు గదులున్నాయి. ఆ మఠంలో కోటి శివలింగాలున్నాయని అంటారు. మేము కూడా వెళ్లి చూసాం. గౌడియా మఠంలో కూడా గదులున్నాయి. నేను లక్షవత్తుల నోము చేసుకున్నది గౌడియా మఠంలోనే. ఈ రెండు మఠాలూ మెయిన్ రోడ్డులో ఉండటం వల్ల అన్ని వాహనాలూ అక్కడే దొరుకుతాయి. ఇక్కడ ఈ కాశీ చుట్టూ కాశీఖండంలో చెప్పిన పంచకోసీ యాత్ర చేస్తూ వుంటారు. మేము మాత్రం అంతంత దూరాలు నడవలేక చిత్రమయఅంగయాత్ర చేసాం. అంటే మొత్తం కాశీని మూడు భాగాలుగా చేసి ఓంకారఖండము, విశ్వేశ్వరఖండం, కేదారఖండం అని పేరు పెట్టారు. ఈ యాత్రలో మొత్తం 19ప్రాచీన శివాలయాలు దర్శించడం. ఆ దేవాలయాలన్నీ పూర్తి చేసేసరికి పటంలోని శివుని చిత్రం గ్రాఫ్ లో లాగా ఏర్పడుతుంది. ఆ చిత్రం పైన జత చేశాను, చూడండి.
ఆ తరువాత మా కాశీ-రామేశ్వరం-కాశీ సంపూర్ణ తీర్థయాత్ర సందర్భంగా రామేశ్వరం నుంచి మేము తెచ్చిన ఇసుకతో మళ్ళీ మాతో లింగాన్ని చేసి, ఆ లింగానికి, పంచామృతాలతో గంగాజలంతో అభిషేక, అర్చనలు చేసి, దానిని తిరిగి గంగలో కలిపాము. ఈ కార్యక్రమాన్ని కేదారఘాట్ లో వున్న ఒక బ్రాహ్మణుడు, ధూళిపాళవారు, చేయించారు. ఆ బ్రాహ్మణుడి పధ్ధతీ, సంప్రదాయం మాకు నచ్చింది. అందువల్లే ఆయన దగ్గరే మేము ఒక సంవత్సరం మా మామగారికి, మరో సంవత్సరం మా అత్తగారికి వారి తద్దినాల రోజునే వారికి కాశీలో తద్దినాలు పెట్టాం. అది కూడా చాలా తృప్తిని ఇచ్చింది. మా తమ్ముడు USA నుంచి వచ్చినప్పుడు కూడా ఆ బ్రాహ్మణుడి చేతనే మా అమ్మ, నాన్నలకు కూడా కాశీలో పిండప్రదానాలు చేయించాను. అప్పుడే మా తమ్ముడు బిస్మిల్లాఖాన్ గారి ఇంటికి కూడా వెళ్లి ఆయన షహనాయిలలో రెండింటిని కొనుక్కున్నాడు. ఆ రూపంలో ఆ ఇంటివారికి కూడా ఆదాయం ముట్టి ఆనందపడ్డారు. ఈరోజుకీ వాళ్ళు అప్పుడప్పుడు బాగున్నారా అని కాల్ చేస్తూ వుంటారు దీదీ అంటూ. ఆయన ఇల్లు వుండే ప్రాంతానికి ఆయన పేరు పెట్టారు కానీ కనీసం ఆ బోర్డు కి కూడా సరైన మర్యాద లేదు. బాధ వేసింది.
ఇక మిగిలింది, అసలైనది, ఎన్ని చెప్పినా అన్నీ దీని తరువాతే అనిపించేదీ, శ్రీ విశ్వనాథ మందిరం. ఆ భయంతోనే అన్నీ చెప్పిన తరువాతే ఈ మందిరం గురించి చెప్తున్నా. ప్రస్తుత ఆలయం పక్కనే పురాతన ఆలయం వుండేది. ఇప్పుడు అక్కడ మసీదు వుంది. ఆ విషయం పాపం ఆ అమాయకపు భక్తుడు నందీశ్వరునకు ఇంకా తెలియదా అన్నట్లుగా ఆ పురాతన కాలపు నంది ఆ గోడ వైపే తిరిగి ఉంటుంది. పాపం ఆ నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుందో. పూర్తిగా సిందూరం పూయబడిన ఆ పెద్ద నంది విగ్రహం పక్కనే ఒక పెద్ద బావి వుంది. దానినే జ్ఞానవాపి అంటారు. ఆ జ్ఞానవాపిలోనే పురాతన శివాలయంలోని లింగాన్ని అప్పటి ప్రధాన పూజారి ముసల్మానుల దండయాత్రలో భయపడి లింగంతో సహా దూకేశాడని అంటారు. ఇప్పటికీ ఆ బావి లోని నీటినే తీర్థంగా భక్తులకు ఇస్తారు. ఈ విశ్వనాథ మందిరంలోనే ఎన్నో లింగాలు, నందులు, ఉపాలయాలు వున్నాయి. వాటిలో కొన్ని దండపాణి, అవిముక్తేశ్వరుడు, సత్యనారాయణుడు, గణేశుడు, గౌరీ మొదలైనవి.
విశ్వనాథ ఆలయం అని ఈనాటికీ మనం చూస్తోంది ఆనాడు అహల్యాబాయి స్థాపించినదే. ఈ ఒక్క చిన్న లింగం కొన్ని కోట్లమందిని ఆకర్షిస్తూ, వారిని తన వద్దకు చేర్చుకుంటూ, వారిని పరిరక్షిస్తూ, కూడా అక్కడ ఒక వెండి పానవట్టంలో చక్కగా కూర్చుని యెంత సింపుల్ గా సాదా సీదాగా వున్నాడో గదా అనిపించింది. ఈ మోక్షపురిలో విశ్వనాథుడు, మరో మోక్షపురిలో జగన్నాధుడు నమ్మిన మనందరికీ రక్షగా వున్నాడు. తమాషాగా విశ్వం అన్నా, జగత్తు అన్నా ఒక్కటే. ఈ విశ్వనాథుణ్ణి చూడాలనిపిస్తే ఈ కింద ఇచ్చిన లింక్ లో చూడండి. ఈ ఆలయం యొక్క అన్ని వివరాలూ ఈ లింకులో కనిపిస్తాయి. https://www.shrikashivishwanath.org/online/live_darshan
మేము కూడా విశ్వనాథుడికి అభిషేకాలు చేసుకున్నాం. సుప్రభాతసేవ చేసుకున్నాం. దర్శనాలు ఎన్నిసార్లు చేసుకున్నామో మేము కూడా లెక్క కట్టలేము. ఒకసారి కేదారేశ్వరాలయంలో ఓ యాభై రవికలబట్టలు, పసుపు, కుంకుమ, గాజులు ముత్తైదువులకు ఇచ్చి వాళ్లకు నమస్కరించుకున్నాను. మరోసారి రెండు మూడు చుట్టల గాజులు కొని అవి విశాలాక్షి గుడిలో పంచాను. ఉన్నన్నాళ్లూ విశ్వనాథుణ్ణి రోజూ రెండు మూడుసార్లు కూడా దర్శనం చేసుకున్నాం. గంగా స్నానాలు, దైవదర్శనాలు, లేదంటే, వూళ్ళోకెళ్లి మా చిత్రమయ అంగయాత్ర లోని దేవాలయాలను సందర్శించడం. రోజులు క్షణాల్లో అయిపోయేవి. అది ఏమిటో ప్రతిసారీ కొత్తగానే ఉండేది. ఎప్పుడూ కొత్తగా మరో ఆలయం ఆ దారిలోనే కనిపించేది. అరే, ఇంతవరకూ దీన్ని ఎలా చూడలేదు అనిపించేది. కాశీలోని పురాతన ఆలయాలు ఎన్ని చూసినా, ఇంకా ఎన్నో ఆలయాలు చూడాల్సినవి ఉండేవి. మొత్తానికి మా కాశీ యాత్రలు చేసిన ప్రతిసారీ ఎంతో ఆనందంగా, తృప్తిగా వెనుతిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం.
ఓం విశ్వనాథాయనమః, ఓం అన్నపూర్ణాయైనమః, ఓం విశాలాక్షినేనమః,
ఓం వారాహీ దేవ్యై నమః, ఓం కాలభైరవాయనమః, ఓం గంగాయైనమః
దీనితో కాశీ యాత్ర ముగించి తరువాత త్య్రంబకం గౌతమీ తటే అని ప్రారంభిద్దాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి