బామ్మా - ఉల్లిపాయలూ

బామ్మా - ఉల్లిపాయలూ 

భట్టిప్రోలు విజయలక్ష్మి


                                                         బామ్మకి ఉల్లిపాయలు పడవు. ఆచారానికి పనికిరావు అనేది. ఇవన్నీ శరీరంలో మొద్దుతనాన్ని తెస్తాయి. చురుకుగా ఉండరు అవి తింటే, అనేది. పైగా ఆ ఘాటు వాసన అంటేనే ఆవిడకి చికాకు. బామ్మ ఇంట్లో ఉంటే మా ఇంట్లోకి ఉల్లిపాయలు వచ్చేవి కాదు. చుట్టుపక్కల వాళ్ళు వండుకున్నా, ఆ వాసన పట్టేసి, చికాకు పడి తిట్టుకునేది. వీలైతే, వాళ్ళతో చనువుంటే, వెళ్లి మరీ, 'తప్పండీ, ఇలాంటి వంటలు తినకూడదు. ఇవన్నీ ఉద్రేకాన్ని పెంచుతాయి. పిల్లలు బండగా అయిపోతారని' చెప్పి వచ్చేది. 'ఎందుకు బామ్మా, నీకు ఉల్లిపాయలంటే కోపం' అని అడిగితే,' మనది నిత్యాగ్నిహోత్రం ఉండే ఇల్లు. ఇలాంటివి ఆచారానికి పనికిరావు' అనేది. 'ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం లేదు కదా బామ్మా', అంటే, 'ఒకప్పుడు ఉండేది కదా, మనం భూమి కింద పండినవి తినకూడదు', అనేది. మరి బంగాళాదుంపలు, కంద, పెండలం, చేమదుంపలూ కూడా భూమి కిందే పండుతాయి కదా, అవి తింటున్నాం కదా,' అని లాజిక్ అడిగితే, 'ఆ...గుడ్డొచ్చి పిల్ల నెక్కిరించిందనీ' అని కోప్పడేది.    

                                                            ఏది ఏమైతేనేం, మొత్తానికి బామ్మకీ ఉల్లిపాయలకీ పడదు, షష్టాష్టకం. అదీ సంగతి. తెలియందేముందీ, అందుకని ఉల్లిపాయలకి మా ఇంట్లోకి ఎంట్రీ వీసా లేదు. కాకపోతే, బామ్మ లేనప్పుడు అప్పుడప్పుడూ వాటికి విజిట్ వీసా ఇచ్చేవాళ్లు అమ్మా, నాన్న. ఉల్లికే వీసా లేకపోతే, వెల్లుల్లికి అసలు ఆ మాత్రం విజిట్ వీసా కూడా ఇచ్చే వీలు లేదు. ఎందుకో అమ్మా, నాన్నా కూడా వెల్లుల్లిని ఇష్టపడేవాళ్లు కాదు. దాంతో మాకెవ్వరికీ వెల్లుల్లి అసలు అలవాటే లేదు. ఉల్లి మాత్రం తరువాత రోజుల్లో తినడం మొదలుపెట్టాం. ఎప్పుడైనా బామ్మ లేనప్పుడు ఇంట్లో ఉల్లిపాయలతో పకోడీల్లాంటివి వండితే, ఆవిడ తిరిగి వచ్చి కనక పసిగట్టిందా, అంతే, దండకాలు, స్తోత్రాలతో  (తిట్లతో)  దీవించేది అందరినీ. ముఖ్యంగా మా అమ్మని, కోడలు కదా, కాస్త చులకన, అంతే. కానీ పెద్దయ్యాక తెలిసింది, కేవలం ఆడవారి వల్ల మాత్రమే, సంప్రదాయాలు నిలుస్తాయనీ, అవి తరువాత తరాల వాళ్లకి తెలుస్తాయనీను. సరే, అది వేరే మాట. అప్పుడు మాత్రం అందరూ ఏమీ ఎరగనట్టు తేలు కుట్టిన దొంగల్లాగా, గప్ చుప్ గా ఉండిపోయేవాళ్లు. అక్కడికీ మిగిలిన ఉల్లిపాయలు కూడా పనిమనిషికి ఇచ్చేసేవాళ్ళు. అయినా బామ్మ ఎంత దూరం నుంచైనా ఉల్లిపాయ వాసన పట్టేసేది. అచ్చం హిరణ్యకశిపుడికి హరి ధ్యాస లాగా, మా బామ్మకి ఉల్లి ధ్యాస ఉండేదేమో లోపల్లోపల. అదీసంగతి. సో, బామ్మ ఉంటే ఉల్లిపాయలు ఇంట్లోకి కాదు కదా, ఇంటి చుట్టుపక్కలకు కూడా రావడానికి వీలు లేదు. అదీ నియమం.   

                                                                        మా బామ్మకో అక్క ఉండేది. సీతమ్మ గారు, మాకు పెద్ద బామ్మ. ఆవిడా వితంతువే. ఆ బామ్మకి మాత్రం ఈ ఉల్లిపాయ పట్టింపు లేదు. పైగా ఉల్లిపాయ పకోడీలు అద్భుతంగా చేసేదట. అందరూ ఈ పెద్ద బామ్మ ఎప్పుడొస్తుందా, ఆవిడ చేత ఉల్లిపాయ పకోడీలు చేయించుకుందామా అని ఎదురు చూసేవాళ్ళు. ఇలా ఈ పెద్ద బామ్మ వచ్చినప్పుడల్లా, తప్పనిసరిగా ఇంట్లోకి ముందు ఉల్లిపాయలు, ఆ వెనకాలే పకోడీలు వచ్చేవి. పెద్ద బామ్మ రాంగానే నెమ్మదిగా, రెండో, మూడో రోజున, మా బామ్మని ఏదో వంక మీద బయటికి పంపించేవారు. 'ఉమాన్నయ్యకి నిన్ను చూడాలని ఉందట, లేకపోతే, మధన్నయ్యకి ఆమ్మ వచ్చిందని చెప్పిరా', అని నన్నూ, బామ్మనీ రిక్షా ఎక్కించి పంపించేవాళ్ళు. నేనే ఎందుకంటే, నాకూ ఈ ఉల్లిపాయల వాసనా పడదు. తలనొప్పి వచ్చేసేది. డోకొచ్చేది. ఇంట్లో బామ్మ తరువాత యాంటీ ఉల్లిపాయ నేనే. ఒకసారి నా ఉల్లి ద్వేషం గురించి అమ్మ మా ఫామిలీ డాక్టరు, హనుమానన్నయ్యను కూడా అడిగింది. 'ఇదెందుకు, ఉల్లిపాయ చూస్తే డోక్కుంటుందీ' అని. అన్నయ్యేమో, 'మెర్క్ సాల్ వాళ్ళ లక్షణం అది, వాళ్లకి ఉల్లిపాయ వాసన గిట్టదు' అన్నాడు. అలా హనుమానన్నయ్య, మెర్క్సాల్ ధర్మమా అని నాకు ఉల్లిపాయ బలవంతంగా తినే బాధ తప్పింది. అలా మమ్మల్ని ఏదో వంకని బయటకు పంపించి,  వీళ్ళందరూ పెద్ద బామ్మతో చక్కగా ఉల్లిపాయ పకోడీలు చేయించుకుని తినేసి, మేము తిరిగొచ్చేసరికి అన్నీ శుభ్రం చేసేసేవాళ్ళు. అయినా వాసనెక్కడికి పోతుందీ? 

                                                                 బామ్మ తిరిగి రాంగానే, 'ఏమే  సీతా, నీకు బుద్ధుందటే, నన్ను బయటికి పంపించి ఇదా నువ్వు చేసే పని,' అంటూ వాళ్ళక్కని ఓ జాడింపు జాడించేసేది. పాపం ఆ అక్కగారు, 'చేయనంటే పిల్లలు బాధ పడతారు, చేస్తే నీతో గోల' అని విసుక్కునేది. మా బామ్మ మాత్రం అధార్టీగా, అక్కలేంటి, అన్నలేంటి, ఎవర్నయినా సరే, దులిపిపారేసేది. ఆవిడ నోటికి అడ్డం ఉండేది కాదు. అందరూ మూతి కాలిన పిల్లుల్లాగా, నిశ్శబ్దంగా తలో మూలా దాక్కునే వారు. మా అమ్మ దగ్గరకొచ్చి,' ఏమే లీలా, నువ్వైనా చెప్పొద్దే,' అనేది. మా అమ్మేమో మామూలుగా, 'మీ అబ్బాయే వాళ్ళ ఆమ్మను అడిగి మరీ చేయించుకున్నారండీ, నేనేం  చేయను' అనేది. కానీ ఉల్లిపాయ పకోడీలు చెయ్యటంలో మా అమ్మ కూడా వాళ్ళ పెద్దత్తగారికి, అసిస్టెంటూ, పైగా పకోడీల్లో అధికారిక వాటాదారూనూ. 'అందరూ అందరే. ఇల్లంతా నేను లేకుండా చూసి మైల మంగళం చేస్తున్నారు', అని ఆరోజు, వంటిల్లూ, కుంపట్లూ, గిన్నెలూ, మూకుళ్ళూ, గరిటలూ, కత్తిపీటలూ మూడు నాలుగు  సార్లు ఆ వాసన పోయేదాకా కడిగించేది. మా నాన్న కూడా అప్పుడు నోరెత్తితే ఒట్టు. 

                                                      ఈ సీత బామ్మకి ఓ కొడుకున్నాడు. ఆయన్ని మా నాన్నా వాళ్ళు, భీముడన్నయ్య అనేవాళ్ళు. ఆయన పూర్తి పేరు భీమభాస్కరరావు కాబోలు. నాకు బాగా గుర్తులేదు. అయినా ఆయన పేరు భీముడన్నయ్య, భీముడు పెదనాన్న, భీముడు బాబాయ్, భీముడు మామయ్య, అంతే. నేను మరీ చిన్నప్పుడు భీముడంటే, బామ్మ దగ్గర భారతం విన్న ఇన్ఫ్లుయెన్స్ తో,  భీముడు అనంగానే, ఓ భారీ కాయాన్ని ఊహించేసుకున్నా. తీరా చూస్తే, ఆయన సన్నగా ఆట్టే పొడవూ, పొట్టీ కానీ సైజులో మామూలుగా ఉండేవాడు. ఈయనా, భీముడంటే, అని మొదట్లో కాస్త ఆశాభంగంగా అనిపించేది. కానీ రాను రానూ అలవాటైపోయింది. పైగా ఈ భీముడు పెదనాన్న అచ్చం మా శర్మ పెదనాన్న లాగానే ఉండేవాడు.  కాకపోతే,  మా శర్మ పెదనాన్న తెలుపు, ఈ పెదనాన్న నలుపు, అంతే తేడా. సో, ఈ ఇద్దరినీ నేను నల్ల శర్మ పెదనాన్న, తెల్ల శర్మ పెదనాన్న అనుకునేదాన్ని చిన్నప్పుడు. మొత్తానికి ఈ పెద్ద బామ్మ ఎన్ని సార్లు వచ్చినా ఇదే సీను పదేపదే రిపీట్ అయ్యేది, ఏమాత్రం తేడా లేకుండా. ఇంకా నేను ఇంటర్మీడియేట్ కి వచ్చేసరికి ఈ భీముడు పెదనాన్నా వాళ్ల అబ్బాయి ప్రసాదన్నయ్యకి మా కాలేజీ లోనే నాన్న బాటనీ లెక్చరర్ గా జాబ్ ఇప్పించాడు. మా ఇంట్లోనే ఉండేవాడు. నాకు ఇంటర్మీడియేట్ లో క్లాస్ రూమ్ లో నాన్నేమో  స్టాటిస్టిక్స్ చెపితే, ఈ అన్నయ్యేమో బాటనీ చెప్పేవాడు. ఎంపిసి గ్రూప్ వాళ్లకు కూడా ఆ రోజుల్లో బాటనీ, జువాలజీ ఉండేవి. 

                                                          మా అమ్మ బామ్మని అనేదా, ఉల్లిపాయలు తిననియ్యటం లేదని. తనేమో అచ్చం అలాగే, పెద్దయ్యాక, వెల్లుల్లిపాయల గురించి  గొడవ చేసేది. అమ్మ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉంటే, వాళ్ళు ప్రత్యేకంగా వెల్లుల్లి సూప్ చేసి తెచ్చేవాళ్ళు, పేషంట్ డైట్ అంటూ.  మా అమ్మేమో వికారంగా మొహం పెట్టి, అటూ ఇటూ చూసి పారబోసేది. ఎంత బతిమాలినా, దెబ్బలాడినా, భయపెట్టినా వెల్లుల్లి మాత్రం ముట్టుకునేది కాదు. ప్రతిరోజూ ఆ నర్సులు వెల్లుల్లి సూప్ తేవడం, మా అమ్మ ఎలాగో ఒకలాగా  దాన్ని పారబొయ్యటం. ఇదే తంతు, ఇలాగే సాగేది, ఎన్నిసార్లు హాస్పిటల్ కి వెళ్లినా. ఈ మాటే శ్రీదేవిపిన్నితో, మా అమ్మ చెల్లెలు,  అంటే, 'పిన్నీ మీ కందరికీ హార్ట్ హిస్టరీ ఉంది, గార్లిక్ తినాలి' అంటే, 'వద్దు బాబూ, నాకు నా హిస్టరీనే ముద్దు, వెల్లుల్లి వద్దు' అంది. మొత్తానికి బామ్మ తరం వాళ్ళు చాలామంది ఉల్లి తినకుండా ఉంటే, అమ్మ తరం వాళ్ళు వెల్లుల్లి తినకుండా ఉన్నారు. దానివల్ల, ఇంట్లో అలవాటు  లేక మా తరం వాళ్లకి అవి ఎలా వండాలో,  వాడాలో చేతకాదు. నేను ఇప్పటికీ వెల్లుల్లి తినాలన్న దుగ్ధతో ఎప్పుడూ అవి కొని, ఎండపెట్టి పారేస్తూ ఉంటాను. ఎక్కడ వాడాలో తెలియదు మరి. ఏం చెయ్యనూ. ఇలా అనంగానే చాలామంది అది ఎలా వాడాలో బోల్డుసార్లు చెప్పారు. అయినా అది బుర్రలోకి ఎక్కదంతే. అలా చెప్పినప్పుడు మాత్రం వెల్లులి కారంపొడి చేసేసి ఓ సీసాలో పోసి పెడతా, ఎప్పుడు వెల్లుల్లి టేస్ట్ కావాలనిపిస్తే, అప్పుడు ఆ ఐటెం లో ఈ పొడి చల్లుకుని తినండి అనేదాన్ని. కాకపోతే, చుట్టుపక్కల బాలింతలు ఉంటే మాత్రం వాళ్ళకోసం ప్రత్యేకంగా వెల్లుల్లి  తెప్పించి ఈ వెల్లుల్లి కారంపొడి తయారు చేసి ఇవ్వటం నా అలవాటు. నాకూ మా అత్తగారు అలానే ఇచ్చింది మరి. ఉల్లిపాయలూ అంతే, అరకిలో తెప్పిస్తే, ఆరు వారాలు ఉంటాయి, తరువాత ఏమై పోతాయనా ప్రశ్న. ఏముందీ,  సింపుల్ గా పాడైపోతాయి, పారేస్తాం, అంతే. ఇదీ మా బామ్మ తరతరాలుగా తెస్తున్న యాంటీ ఉల్లీ, వెల్లుల్లీ సంప్రదాయం.  అన్నట్టు మరో విషయం మా వారి క్కూడా చిన్నప్పుడు నాలానే, ఉల్లిపాయ ఇష్టం ఉండేది కాదట. పెద్దయ్యాక హోటల్ భోజన పర్వంలో తప్పనిసరి అయి తినడం మొదలుపెట్టారుట.  సో, ఇద్దరం సేమ్ బాచ్. మరోసారి మరో కాన్సెప్ట్ తో కలుద్దాం. బై.                                                     












కామెంట్‌లు

  1. జై శ్రీరామ్! చాలా సంతోషం మీ ఓపికకు...ఉల్లిపాయలు వెల్లుల్లి మునగ ఆకు కాడలు గోంగూర దొండకాయ ముల్లంగి పుట్టగొడుగులు వంటివి తినడం సాంప్రదాయం కాదు ఎందుకు అంటే తమే రజో గుణ సంబంధింత పదార్థాలు తినడం బ్రహ్మ చర్య వ్రతభంగం జరుగుతుంది అని...ఇకపోతే గృహస్తాశ్రమం లో ఉన్నవారు బ్రహ్మచర్య వానప్రస్త సన్యాసాశ్రమాలకంటే గొప్ప వారు...ఆశ్రమధర్మాచరణలో కాబట్టి ఆ వ్రతభంగం కాకూడదనే ఉద్దేశ్యం తో ఇటువంటి పదార్థాలు తినడం మంచిది కాదు అని...అంతేగాక మూడు ఆశ్రమవాసులకు గృహస్థాశ్రమమే ఆధారం...అటువంటి ఆధారం బలంగా దృఢంగా ఉండాలి కదా...అదీ విషయం దానినే నిత్యాగ్నిహోత్రం అంటారు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా అమ్మ

99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ