బామ్మ-నిష్క్రమణం

బామ్మ-నిష్క్రమణం 

                     భట్టిప్రోలు విజయలక్ష్మి  


                                                                     అప్పటికి ఉమా పెదనాన్న ఇంటి నుంచి బామ్మ మా ఇంటికి వచ్చి మూడు వారాలు. ఈ మూడు వారాలు ఇంట్లో అందరికీ ఏదో ఒక రకంగా తన చాదస్తం, పెంకితనంతో చుక్కలు చూపించింది. వాటిల్లో ఒకటి నా చేతిలో మందులు లాక్కుని తనే పొరపాటున ఒక మందుకు బదులు ఇంకో మందు వేసుకుని చేసిన హడావుడి. పాపం అప్పటికప్పుడు సరోజినత్తయ్య బందరు నించి వాళ్ళ అమ్మకి ఏమైపోతుందో అని పరిగెత్తుకు వచ్చింది కూడాను. ఒకరోజు 'లీలా,నాకు ఓపిక లేదే, స్నానం చెయ్యలేను, స్నానం చెయ్యకుండా, మడి కట్టుకోకుండా అన్నం తినలేను, ఎలా' అన్నది. అచ్చం బైజూబావరా సినిమాలో స్వామి హరిదాస్ లాగా. అమ్మేమో అప్పుడు పాపం మడి కట్టుకుని ఉన్నది. వెంటనే ఓపికకు ఓ గ్లాసుడు హార్లిక్స్ కలిపి ఇచ్చింది. బామ్మకి కొంచం ఓపిక వచ్చింది. అసలే మా బామ్మకి హార్లిక్స్ మీద అపారమైన గురి. అదే ఆ రోజుల్లో ఆవిడకి ఎలిక్సర్. ఈసారి పాపం హార్లిక్స్ తాగినా బాత్రూంకి వెళ్లేంత ఓపిక రాలేదు. అప్పుడు నేనే, 'బామ్మా నేను నీళ్లు పోయనా', అని అడిగి ఓ చెక్క కుర్చీ తెచ్చి ఆవిడ మంచానికీ, తూముకీ మధ్యలో వేసి, దాంట్లో ఆవిడను కూర్చోబెట్టి స్నానం చేయించా. ఈ ఏర్పాటు చూసి చాలా ముచ్చట పడింది. స్నానం చేయించి, మడి బట్టలు కట్టి, కుర్చీ మీద కూర్చోబెట్టాను. మా అమ్మ ఒక కంచంలో బామ్మ భోజనం పెట్టి పట్టుకొచ్చి, కుర్చీ పక్కన ఒక టేబుల్ వేసి, ఇహ ఇక్కడే తినండి, అంది. అలా ఆ రోజు బామ్మ మొదటిసారిగా వంటింట్లో కాకుండా తన గదిలోనే కుర్చీలో టేబుల్ మీద కంచం పెట్టుకుని భోజనం చేసింది. ఆ రోజు నుంచీ అమ్మ బామ్మ భోజనానికి అదే ఏర్పాటు చేసేది. నాకూ అప్పుడు సమ్మర్ సెలవులు కనుక, బామ్మకి స్నానం చేయించే డ్యూటీ వేసుకున్నా. నాన్నేమో బామ్మ గది తలుపులకి, కిటికీలకీ వట్టివేళ్ల తడికలు కట్టించి ఓ టేబుల్ ఫ్యాన్ బామ్మ కోసం ప్రత్యేకంగా పెట్టి, ఆ రూమ్ చల్లగా చేసాడు. ఆవిడ గదిలోకి వెళ్తే, అంత చల్లగా అలవాటు లేక మాకు చలేసేది. ఆ సంవత్సరం ఎండలు కూడా చాలా మండిపోయాయి. మా అమ్మకి ఏదో అనుమానం వచ్చినట్టుంది. ఈసారి ఈ ఎండలు తట్టుకోవటం పాపం మీ బామ్మకి కష్టమే అన్నది. 

                                                   స్నానానికి అంత ఏడిపించేది కాదు కానీ, తలంటుకి మాత్రం నన్ను తినేసేది. జుట్టు ముట్టుకుంటే, కయ్యి మనేది. 'ఓ లీలా, నీ కూతురు నన్ను చంపేస్తోంది', అని మా అమ్మకి వినిపించేలా అరిచేది. మొదట్లో కాస్త భయపడ్డా, 'అబ్బే, ఈవిడ అరుపులకి భయపడితే అసలు తలస్నానం కానే కాదని, చకచకా నా పద్ధతిలో నేను కుంకుడు రసమో, శీకాయ రసమో పోసి తల రుద్దేసేదాన్ని. ఆ రోజుల్లో మాకు షాంపూలు తెలియవు. రోజూ నా పని ఇదే, బామ్మకి స్నానం చేయించటం, మడి బట్టలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టటం, నూనె రాసి  చిక్కు తీసి తలా దువ్వటం. మా అమ్మేమో ఆవిడ గదికే భోజనం తెచ్చి పెట్టటం. వారానికోసారి, తలంటి పొయ్యటం. ఆ రోజుల్లోనే, కూర్చుని చచ్చిపోతే స్వర్గానికీ, మంచం మీద పడుకుని చచ్చిపోతే నరకానికీ పోతాం అనే కొత్త ఫిలాసఫీ అందరికి చెప్పి, దాన్నే  చివరిదాకా పాటించింది. మధ్యాన్నం భోంచేసి ఆ కుర్చీలోనే కూర్చుని కునికిపాట్లు పడుతూ బోల్డు కళ్లజోళ్లు విరగ్గొట్టుకున్నది. మళ్లీ కంటి హాస్పిటల్ కి మాత్రం ఓపిక లేదు అన్న మాట ఎత్తకుండా వచ్చేది. ఆ ఒక్క పనే ఆవిడకి సరదాగా ఉండేదో ఏమో మరి. ఎవరు ఎంత చెప్పినా మధ్యాన్నం నిద్ర మాత్రం కుర్చీలోనే, అదీ కళ్ళజోడు పెట్టుకునే. రాత్రిపూట మాత్రం మంచం మీద పడుకోవటం పాపం తప్పలేదు. ఎందుకో ఇక ఎక్కువ రోజులు బతకదనే విషయం ఆవిడకి తెలుసేమో అన్నట్టు ప్రవర్తించేది.  కానీ చనిపోతాననే భయం మాత్రం ఆవిడలో నేనెప్పుడూ చూడలేదు. తన పాటలు, భజనలు తను పాడుకునేది. మనసు పుడితే కూర్చోబెట్టి ఏవో పాత కాలం ఖబుర్లు చెప్పేది. ఇలా కొన్నాళ్లు గడిచింది.

                                                       డాక్టరుగారు చెప్పిన పథ్యం  పాటించి నాకు మరీ చప్పిడి తిండి పెడుతున్నారు, అని గోల చేసేది. ఓసారి ఇంటి ఓనర్ కృష్ణప్రసాద్ గారు వస్తే, వీళ్ళు నాకు సరిగ్గా నచ్చింది పెట్టట్లేదండీ, అని కంప్లైన్ చేసింది. పాపం మా నాన్న ఎంబరాస్ అయ్యాడు. కృష్ణప్రసాద్ గారు మాత్రం, పోనీలెండి, నేను మీకోసం మన కొబ్బరి చెట్టు మీద నుంచి ఇప్పుడే బొండాలు దింపించి ఇస్తాను. చల్లగా ఆ నీళ్లు తాగండి, అని అప్పటికప్పుడు ఎవరినో పిలిపించి బొండాలు దింపించి మరీ ఆవిడతో కొబ్బరినీళ్లు తాగించాడు. కృష్ణప్రసాద్ గారు కూడా మా బామ్మని చాలా గౌరవంగా చూసేవాడు. తరువాత మరో రోజు పక్కింటివాళ్ళు అప్పడాలు పెడుతుంటే, ఆ పిండి అడిగి తీసుకువచ్చి ఎంత వద్దంటున్నా, అది అన్నంలో కలుపుకుని తిన్నది. ఆ రోజు లూజ్ మోషన్స్. పైగా నేనేం తినలేదని డాక్టరుతో చెప్పండి, అని ఓ ఉచిత సలహా ఇచ్చేది. మా అమ్మ ఇలా  ఈవిడ నాకు తెలిసి ఎప్పుడూ లేదు, ఎవరికైనా పెట్టటమే కానీ, అడిగి తీసుకొచ్చి తినటం నేను ఎప్పుడూ చూడలేదు, అని వాపోయింది. డాక్టర్ పుల్లయ్యగారికి చెప్తే, ఇంక ఆవిడని వదిలెయ్యండి, కావలసినవి తిననియ్యండి. అని పథ్యం నియమాలు పూర్తిగా  తీసేసారు. మాకు వింతగా ఉండేది. బామ్మ ఏమిటి, ఇలా చేస్తోంది, అని. ఇక ఆ చివరిరోజు రానే వచ్చింది.
                                                     
                                                               ఆ రోజు అనుకోకుండా ఆరుగొలను నుంచి ఆ ఊరు చిన్న కరణం గారు, ఎవరినో తీసుకుని బామ్మ కోసం మా ఇంటికి తెనాలి వచ్చారు. ఆయన పేరు నండూరి వెంకటేశ్వరరావు. బామ్మకీ, మా అమ్మకీ దూరపు బంధువు కూడాను. ఆరుగొలనులో మా అమ్మా వాళ్ళ పక్కిల్లే ఆయనది. ఆ ఊరికి మా తాతగారు, అమ్మా వాళ్ళ నాన్న, కరణం. ఆయన పోయిన తరువాత ప్రస్తుత కరణం ఈయనే. అప్పటికి మా అమ్మ వాళ్ళ నాన్నగారు పోయి ఒక సంవత్సరం. ఆయన్ని చూడంగానే బామ్మ మహా సంతోష పడిపోయి కాసేపు చక్కగా ఊరి విశేషాలు మాట్లాడింది. ఆయన కాస్తా నెమ్మదిగా, తనతో వచ్చిన వ్యక్తి, ఆరుగొలనులో బామ్మ ఇల్లు కొంటానంటున్నాడని చెప్పాడు. ఇక అంతే, జుయ్యిమని తారాజువ్వలా లేచి, ఆయన్నీ, ఆయనతో వచ్చిన వాడినీ నానా తిట్లూ తిట్టింది. నువ్వెంత, నీ బతుకెంత, నా ముందు గోచీల్లేకుండా తిరిగిన బుడ్డోళ్లు మీరంతా, నా ఇల్లు అమ్మించేంత వాడివయ్యావా, అని రామ, రామ ఎన్ని తిట్టాలో అన్ని తిట్లు తిట్టింది. బామ్మకి అన్ని తిట్లు వచ్చని, ఎవరినైనా ఎంచక్కా మొహమాటం లేకుండా తిట్టగలదనీ కూడా మాకు బాగా తెలిసింది అప్పుడే. ఆయన పాపం బిత్తర పోయాడు. బామ్మ సంగతి తెలుసు గానీ, ఇప్పుడు పెద్దదయ్యింది, తాను కూడా గ్రామ కరణం అయ్యాడు కదా, ఏమీ అనదులే అన్న ధైర్యంతో, పాపం ఎవరో ఇల్లు అడుగుతుంటే, తీసుకువచ్చాడు. పొద్దున్ననంగా బయలుదేరి మూడు బస్సులు మారి వస్తే, ఈ విడ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతోంది. నోరు మూసుకుని ఉండిపోయాడు. బామ్మ భాషలో చెప్పాలంటే, "కిమన్నాస్తి". మా నాన్నకి ఆయన వసారాలోనే పాపం తాను ఎందుకు వచ్చాడో ముందే విషయం చెప్పాడు. మా నాన్నేమో, ఆవిడకి ఇష్టం అయి అమ్మితే, మాకెవరికీ ఏమీ అభ్యంతరం లేదు. అడిగి చూడండి అన్నాడు. ఈ అరుపులు విని నాన్న పరిగెత్తుకు వచ్చాడు. ఇష్టం లేకపోతే ఇల్లు అమ్మకమ్మా, వదిలేయ్, అని చెప్పాడు. బామ్మ వింటేనా, నానా ఆగం అల్లరి. పెద్ద గొంతేసుకుని పడిపోయింది ఆ చిన్న కరణం గారి మీద.

                                                    "వీడ్ని ముందర ఇంట్లోంచి వెళ్లగొట్టు, రాంక్రిష్ణా ", అని నాన్నకి ఆర్డర్ వేసింది బామ్మ. అప్పుడు మధ్యాన్నం 12 గంటలయింది. నాన్న మొదటిసారి బామ్మ మాట కాదన్నాడు. అమ్మా, ఇల్లు అమ్మద్దు. కానీ వాళ్ళు ఇంత ఎండలో బోల్డు దూరం నుంచి మూడు బస్సులు మారి వచ్చారు. లీల వంట చేస్తోంది. భోంచేసి వెళ్ళిపోతారు. ఇలా పంపించటం మర్యాద కాదన్నాడు. అప్పటికి బామ్మ భోజనం కూడా కాలేదు. బామ్మా ఠాట్, వీల్లేదంది. నాన్న మాత్రం, బామ్మకి మళ్ళీ నచ్చ చెప్పచ్చులే అనుకుని, వాళ్ళను గది లోంచి బయటికి తీసుకువచ్చాడు.  ఇంక అంతే, బామ్మ పంతం పట్టేసింది, నేనేమీ తిననూ అని. వచ్చిన వాళ్ళు మొహమాటంగా భోజనాలు చేసి, మళ్ళీ బామ్మ దగ్గరకు వచ్చి, ఆయన, 'నీకు నచ్చకపోతే వద్దులే అత్తయ్యా, పొరపాటయింది, క్షమించు, లేచి భోజనం చెయ్యి' అని చెప్పాడు. బామ్మకి సడెన్ గా హైఫీవర్ వచ్చేసింది. వణకటం మొదలెట్టింది. నాన్న ఖంగారుగా డాక్టర్ ని పిలిచారు. ఆయన చూసి, చివరి ఘడియలండీ, అందరినీ రమ్మని పిలవండి. ఐస్ పెట్టి బాడీ టెంపరేచర్ తగ్గిస్తూ ఉండండి, అంతకన్నా ఏమీ చేయలేము అని చెప్పాడు. నాన్న కంగారు పడిపోయాడు. అందరికీ కబురు పెట్టాడు.

                                                                   ఐస్ వచ్చాక, అమ్మా, పక్కింటావిడా, నేనూ బామ్మకి ఐస్ పెట్టటం మొదలుపెట్టాం. అసలు టెంపరేచర్ డౌన్ అవలేదు. బామ్మని మంచం మీద నుంచి దించి కింద పెట్టడానికి నాన్న ఇష్టపడ లేదు. ససేమిరా అన్నాడు. చుట్టూ అందరూ చెప్పి చూసారు. ఆవిడ ఇన్ని రోజులూ అందరితో చెప్పింది, మంచం మీద పోకూడదని. తప్పదు దించాలి, అని కృష్ణప్రసాద్ గారు కూడా చెప్పారు. నేను వెళ్లి వసారాలో చాప వేసాను. నాన్న నేను "మా అమ్మని చాప మీద పడుకోబెట్టను", అని మా అందరి మీదా అరిచాడు. నాన్న కన్నీళ్లు పెట్టుకోవటం అప్పుడు చూశాను. చివరికి మధ్యే మార్గంగా, రెండు బెంచీలు తెచ్చి వాటిని కలిపి ఒక బెడ్ లాగా చేసి తల కింద ఓ దిండు పెట్టి పడుకోబెట్టాం. అమ్మ తులసి నీళ్లు తెచ్చి నాన్నకిచ్చి బామ్మ నోటిలో పొయ్యమంది. నాన్న ఏడుస్తూ 'నారాయణ, నారాయణ' అంటూ బామ్మ నోట్లో తులసి నీళ్లు పోసాడు. నాన్న తల దగ్గర, అమ్మా, పక్కింటావిడా ఒకవైపు, పక్కింటాయన మరోవైపు బామ్మని పట్టుకున్నారు. నేను కాళ్ళు రెండూ పట్టుకుకున్నాను. మిగిలిన పిల్లలు ముగ్గురూ బిక్క చచ్చిపోయి లోపలే ఉన్నారు. అందరికీ స్పష్టంగా అర్ధం అయ్యింది, ఇక వెళ్లిపోవటానికి ఆట్టే సమయం లేదని. ఉన్నట్టుండి రెండు కాళ్ళూ నా చేతిలో ఉండగానే దూరం జరిపేసింది. ఒక ప్రయాణం ముగిసింది. అదే నేను మొదటిసారి మరణాన్ని అంత దగ్గరగా నా చేతుల్లోనే  చూడటం. నా చేతిలోనే ప్రాణం పోవటం. కాసేపు అంతా  మౌనం.  అప్పుడు బామ్మ శరీరాన్ని దింపి చాపపై పడుకోబెట్టాం. దింపేటప్పుడు నా స్థానం మళ్ళీ కాళ్ళ దగ్గరే. ఒక్కొక్కళ్ళూ రాత్రి కంతా వచ్చేశారు. బామ్మ శరీరం చుట్టూ కర్పూరం చల్లుతుంటే సీతారాం ఆమ్మ, భయం లేదుటే నీకు, అని అడిగింది. ఎందుకు, బామ్మేగా అన్నా.

                                                                తెల్లారింది. అంత్యక్రియలైపోయాయి. మూడోరోజు అస్థి సంచయనం చేసి అందరూ బెజవాడ వెళ్లిపోయారు. మిగిలిన కార్యక్రమాలు అన్నీ ఇక బెజవాడలోనే. సొంత ఇల్లు, బామ్మ పెద్దకొడుకు ఇల్లు కదా,  అందుకని. అమ్మ మిగిలిన పిల్లలతో వాళ్ళందరితో పాటు బెజవాడ వెళ్ళిపోయింది. ఆ వచ్చిన ఆరుగొలను అతిధులు కూడా ఆ రోజే వెళ్లారు. నేనూ, నాన్నా మిగిలిపోయాం. ఎందుకంటే, బామ్మ చనిపోయిన నక్షత్రమో, తిథో ఏదో బాగా లేదట, బామ్మ గదీ, వసారా, ఇంటి మెయిన్ గేట్ మూసెయ్యాలన్నారు. మేమిద్దరం ఉండి పనివాళ్ళతో, ఏమాత్రమూ గాలీ వెలుతురూ రాకుండా బామ్మ గది మూయించి అన్నీ తాళాలేసి, ఆ రాత్రికి బెజవాడ చేరుకున్నాం. భయమూ లేదు, ఏడుపూ లేదు. అంతా నిశ్శబ్దంగానే అన్నీ చేసాం. అంతే. ఇప్పుడనిపిస్తుంది, నేను నాన్న పక్కన ఎప్పుడూ ఒక ఆడపిల్ల లాగా కన్నా, మగపిల్లాడి లాగానే ఎక్కువగా ఉండేదాన్నని.  ఒక అధ్యాయం ముగిసింది అనిపించింది. మొత్తానికి బెజవాడలో వైభోగంగా బామ్మ కర్మలు ముగిశాయి. అందరూ మళ్ళీ కలవడం కష్టమని ఆ 12 రోజుల్లోనే, ఆ ఇల్లు  అప్పుడు ఇల్లు కొనటానికి వచ్చిన ఆయనకే అమ్మేశారు. ఆ వచ్చిన డబ్బు ఆవిడకే  ఖర్చుపెట్టారు. ఆవిడ ఎవరి డబ్బూ వాడదుగా మరి. వియ్యమ్మగారి శకం ముగిసింది. అప్పుడు ఆవిడకి సుమారు 80 ఏళ్ళు.  అందరికీ తన జీన్స్ ఇచ్చి, ధైర్యాన్ని పంచి, ఎప్పుడు ఎలా ఉండాలో నేర్పి తాను నిష్క్రమించింది. ఆవిడ గురించిన  జ్ఞాపకాలు మాత్రం అలాగే నా మైండ్ లో స్థిరంగా ఉండిపోయాయి. ఆ బరువు దించుకునే ప్రయత్నమే ఇదంతా. బామ్మా, నీకు వందనం. హాట్స్ ఆఫ్.

                                                                       



కామెంట్‌లు

  1. Every one has to go, even such a great personality! You have beautiful memories and you did great thing by passing on those memories to future generations through your writings.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా అమ్మ

99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ