సంబరంగా ఆరాధనలు, ఆబ్దీకాలు
సంబరంగా ఆరాధనలు, ఆబ్దీకాలు
భట్టిప్రోలు విజయలక్ష్మి
ఇక మా ఉమా పెదనాన్నా వాళ్ళ ఇంట్లో ఎంతో సంబరంగా జరిగే ఆరాధనలు, ఆబ్దీకాలు గురించి చెప్తా. సంబరాలేంటి, ఆరాధనలేంటి, ఆబ్దీకాలేంటి అనుకుంటున్నారా. మా పిల్లలకి అవన్నీ పెద్ద సంబరాలు. పెద్దలకీ అంతేననుకోండి. ఎందుకంటే మా ఫామిలీలో ఒక అన్ రిటెన్ రూల్ ఏమంటే, ఏదో మరో పెద్ద ఇబ్బంది ఉంటే తప్ప ఈ కార్యక్రమాలకి ఎవరూ మిస్ కాకూడదని. సుమారు 20, 25 మంది చిన్నపిల్లలు, ఓ 10, 15 మంది పెద్ద పిల్లలు, మరో 20 మంది దాకా పెద్దలు, ఇంతమంది ఒక్కసారి, ఒక్కచోట కలుసుకునే అవకాశాలు సంవత్సరానికి ఆ రెండే. మొదటిది మా తాతగారు స్వర్గీయ ఆనందరామయ్య గారి ఆరాధన, ఆబ్దీకం, రెండోది బామ్మ, విజయరామమ్మ, వియ్యమ్మ గారి ఆబ్దీకం. అందులోనూ మా తాతగారు సన్యాసం తీసుకున్న తరువాత చనిపోయారు కనుక, ఆయనకి మొదటి రోజు ఆబ్దీకం పెట్టి, రెండో రోజు ఆరాధన చేసేవారు. ఇలా చాలాకాలం జరిగింది. ఆ ఆరాధన సమయంలో అప్పటి కుర్తాళం పీఠాధిపతి త్రివిక్రమ రామానంద భారతి స్వామి కూడా వచ్చే వారు. ఆయన మా పెద్ద పెద్దనాన్నగారికి క్లాస్ మేట్. వారు చెప్పారు, సన్యాసులకు ఆబ్దీకాలు పెట్టకూడదు. వాళ్ళు సన్యాసం తీసుకున్నారంటేనే, వాళ్ళ ఆత్మ పిండం వాళ్ళే వేసుకుని, సన్యాసాశ్రమం లోకి ప్రవేశిస్తారు. కనుక వాళ్లకు ఆబ్దీకాలు ఉండవని తేల్చి చెప్పారు. దాంతో, తాతగారికి ఆబ్దీకాలు మానేశారు, కానీ ఆరాధనలు మాత్రం ప్రతియేటా ఆ రోజు చేసేవాళ్ళు. ఈ త్రివిక్రమ రామానంద భారతి స్వామివారు ఆ రోజుల్లో తెనాలిలో మా ఇంటికి వచ్చి పీఠం పెట్టి, మా నాన్న ప్రిన్సిపాల్ గా చేసే కాలేజీలో ప్రవచనాలు ఇచ్చేవారు. వారి ద్వారానే పుష్పగిరి పీఠాధిపతి విద్యానృసింహ భారతి స్వామి కూడా మాకు పరిచయం అయ్యారు. వారూ అలాగే, మా ఇంట్లో పీఠం పెట్టి కాలేజీలో ప్రవచనాలు ఇచ్చేవారు. పుష్పగిరి పీఠానికి కుర్తాళం పీఠం ఉప పీఠం. సరే, ఈ వివరాలన్నీ మరో పోస్ట్ లో రాస్తాను. ప్రస్తుతానికి వద్దాం. ఆ రకంగా తాతగారికి ఆబ్దీకాలు ఆపి ఆరాధనలు మాత్రం జరుపుకోటానికి అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
తాతగారికి ఈ ఆరాధనలు (ఆబ్దీకాలు) జరిగేటప్పుడు, అన్నదమ్ములు ఏడుగురూ, వరసగా కూర్చుని చేసేవారు. ఒక పెదనాన్న దత్తు వెళ్లారు కనుక ఆయన కూర్చోలేడు. బామ్మ తద్ధినానికైతే ఐదుగురే. బామ్మ తన పిల్లలు ఇంతమంది ఇంత శ్రద్ధగా శ్రాద్ధం పెడుతుంటే, దిష్టి కొడుతుందని భయపడేది. పొద్దున్నే పిల్లలందరికీ వదినలు, అత్తయ్యలు అన్నాలు పెట్టేసేవారు. లేకపోతే, మామూలుగా భోజనాలయ్యేసరికి మూడో, నాలుగో అయ్యేది. మా పిల్లలు అంతవరకూ ఆకలికి ఆగలేరని, మాకోసం వేరే వంట చేయించి అన్నాలు పెట్టేసేవారు. కోడళ్లందరూ మడి కట్టుకుని వంటలు పర్యవేక్షిస్తూ లోపలే ఉండి పోయేవారు. సో, అమ్మలూ, నాన్నలూ బిజీ. అన్నాలు తినేసాక పిల్లలందరం ఎన్ని రకాల ఆటలు ఆడుకునే వాళ్ళమో. కొత్త కొత్త ఆటలు కనిపెట్టి మరీ ఆడేవాళ్ళం. యెంత సంబరంగా ఉండేదో, అలా అందరం కలుసుకుని ఆడుతుంటే. పెళ్ళిళ్ళకీ అందరం కలుస్తాం కానీ, అప్పుడు ఇలా ఖాళీ ఉండేది కాదు. ఏదో పని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. కొంతమంది పెద్దపిల్లలు అందరినీ ఏమార్చి సినిమాలకి వెళ్లిపోయేవాళ్లు. కొంతమంది పేకాట, లేకపోతే కారంబోర్డో ముందేసుకుని కూర్చునే వాళ్ళు. మా ఉమా పెదనాన్న వాళ్ళింట్లో ఓ పెద్ద కారంబోర్డు అటక మీద ఉండేది. వేసవి సెలవుల్లోనూ, లేదా ఇంటికి అందరూ వచ్చినప్పుడో దాన్ని దించేవారు. పేకాట అంటే, పెద్ద పెద్ద ఆటలు కావు, బొమ్మస్తుందా రాదా లాంటి ఆటలు. బామ్మ ఉన్నప్పుడైతే, కొందరం బామ్మ చుట్టూతా కూడా చేరేవాళ్ళం. యెంత బిజీగా ఉండే వాళ్ళమంటే, మధ్యలో పిండాలకి దణ్ణం పెట్టమని, మా పిల్ల మూకని కూడా ఓ సమయంలో పిలిచేవాళ్ళు. అందరం వరుసలో వెళ్లి దణ్ణాలు పెట్టేసుకుని మళ్ళీ వచ్చి ఆటల్లో, కబుర్లలో పడిపోయేవాళ్ళం. పెద్దవాళ్ళ భోజనాలు అయి, మమ్మల్ని పిలిచేదాకా ఆకలి మాటే గుర్తొచ్చేది కాదు. ఆకలి ఎందుకేస్తుందీ, పొద్దున్నే శుభ్రంగా అన్నీ తిన్నాంగా. ఈ కార్యక్రమం అయిపోయి అందరం తిరిగి వెళ్లిపోతుంటే, ఎంత బాధ వేసేదో, దిగులుగా ఉండేదో. మళ్ళీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళితే, అన్నీ మామూలు రొటీనే కదా మరి.
బామ్మ పోయినప్పుడు మాత్రం మా ఈ కోలాహల పర్వం ఓ పది రోజులు సాగింది. పెద్దావిడ పోయిందనే దుఃఖం లేదు కదా, అదో పండగ లాగా ఉండేది. మా కొత్త ఆటలు కనిపెట్టే గోలలో, శ్రీలక్ష్మి, ఉమా పెదనాన్న కూతురు, అప్పుడు దానికి పదేళ్లేమో. వాళ్ళ ఇల్లు మూడంతస్థుల మీద కదా. ఒక స్టెయిర్ కేస్ లోపల నుంచే ఉండేది. మెట్ల పైకి ఎక్కడం, ఆ రాంప్ మీద నుంచి జర్రున జారటం, మళ్ళీ ఎక్కటం, మళ్ళీ జారటం, ఇదో ఆట. పాపం శ్రీ లక్ష్మి పడి దాని కాలు విరిగింది. దాంతో కొన్ని ఆటలు బంద్ అయ్యాయి. అది మాతో ఆడలేకపోతున్నా అని పాపం గోల పెట్టేది. మా ఇందిరక్క ఏమో, ఎప్పుడూ పెద్దమనిషే, మాలా ఈ చిల్లర ఆటలు ఆడేది కాదు. బుద్ధిగా, బాధ్యతగా ఉండేది. శ్రీలక్ష్మిని అన్నాళ్ళూ తనే చూసుకుంది. అలాగే మా చిన్నన్నయ్య మురళి కూడా చాలా పెద్దరికంగా డబ్బు బాధ్యత చూసుకునేవాడు.ఇక మిగిలిన పెద్ద మగపిల్ల లందరూ ఇంకోరకం అల్లరి చేసేవాళ్ళు. భోక్తలు భోజనం చేస్తుంటే, వీళ్ళ రాగింగ్ మామూలుగా ఉండేది కాదు. వెనకాల గదిలో కూర్చుని, ఏ భోక్త ఎన్ని గారెలు తిన్నాడో, ఎన్ని అప్పాలు తిన్నాడో లెక్కేసేవాళ్ళు, 1, 2.....10 అంటూ. లెక్కపెట్టి, హోరున నవ్వులు. లోపల వడ్డిస్తున్న పెద్దవాళ్ళకి అర్ధం అయ్యేది కాదు, వీళ్లెందుకు నవ్వుతున్నారో. ఏయ్, ఈ అల్లరేంట్రా, పొండి, అని కేకలేసేవాళ్ళు. కాసేపు ఊరుకుని మళ్ళీ మొదలు. ఎవరి సందడి వాళ్లదే. మొత్తం మీద, ఈ తద్దినాలూ, ఆరాధనలూ ఎంచక్కా, ఏ అడ్డంకులూ లేకుండా జరిగేవి.
ఓసారి ఓ తమాషా జరిగింది. బామ్మకి అందరూ తద్దినం పెట్టేసాక ఆ పిండాలని కృష్ణా నదిలో కలిపే పని అందరి కన్నా చిన్నవాడు అని శ్రీధర్ బాబాయికి అప్పచెప్పారు. బాబాయిది ఓ కండిషన్ ఉండేది. తాను తిరిగి వచ్చేదాకా అన్నయ్య లెవరూ అన్నం తినకూడదని. రోజూ అలాగే జరిగేది. ఓ రోజు పాపం బాబాయికి ఎందుకో బాగా లేట్ అయ్యింది. దాంతో పెద్ద వాళ్ళు నీరసం వస్తుంటే, ఇక లాభం లేదు, వాడు వచ్చాక తింటాడులే అని భోజనాలు మొదలుపెట్టారు. మధ్యలో వచ్చాడు బాబాయ్. ఇంకేముంది, చర్రున కోపం వచ్చింది. నన్ను చిన్నపిల్లాడిని చేసి పంపించి, మీరు మాత్రం తినేస్తున్నారు, అని అలిగాడు. ఎంతకీ భోజనానికి రాడు. ఎవరు చెప్పినా వినలేదు. మా పిన్నిని చెప్పమంటే, పిన్నేమో, మీమాటే వినంది నా మాటేం వింటారు, అని తప్పుకుంది. చివరికి పెద్దత్తయ్య వచ్చి గట్టిగా అరిస్తే కానీ కదలలేదు. పెద్దత్తయ్య, పేరుకు అక్కయ్యే కానీ, అందరికీ బామ్మ తరువాత తానే తల్లిలా ఉండేది. ఆవిడదెప్పుడూ తల్లి మనస్తత్వమే. "పెద్దవాళ్ళు, పెద్దన్నయ్యా, పెద్ద బావగారూ యెంత సేపు ఆగగలర్రా, నేనే భోజనాలు మొదలు పెట్టమన్నాను. లే భోజనానికి రా" అని బాబాయిని గట్టిగా కేకలేసింది. పాపం ఆకలికూడా వేస్తోందేమో, పైగా మే నెల బ్లేజ్ వాడ ఎండల్లో మిట్ట మధ్యాన్నం కృష్ణా నది దాకా వెళ్లి వచ్చాడేమో, తనకీ నీరసం వచ్చి ఉంటుంది. సరే, బాబాయ్ అలక మాని భోజనానికి కూర్చున్నాడు, కానీ నాకు నెయ్యి వద్దు, అంటూ, తనే నెయ్యి బదులు మంచినీళ్లు వడ్డించుకుంటూ మొత్తానికి భోజనం ముగించాడు. ఏదో, అలా అలకలతో ఆ పూట భోజనాలు పూర్తి అయ్యాయి. మా పిల్లలందరం, ఈ బాబాయి ఏమిటి, ఇలా అల్లరి చేస్తున్నాడు, చిన్నపిల్లాడిలా అనుకున్నాం. అప్పుడు పెద్దత్తయ్య చెప్పింది, "మా అందరిలోకీ చిన్నవాడు కదే, మాకు అందరికీ వాడంటే ముద్దే, అయినా మా దగ్గర అలగక పోతే, ఇంకెక్కడ అలుగుతాడూ", అని నవ్వేసింది. ఆయనంటే అందరికీ అంత ముద్దు మరి. ఇదీ అందరిలోకీ చిన్నపిల్లాడయిన మా ముప్ఫయి ఏళ్ళ బాబాయి అలక పర్వం ముచ్చట.
ఇక్కడ బ్లేజ్ వాడ అనే పేరు విజయవాడకి ఎలా వచ్చిందో కాస్త చెప్తాను. అసలు విజయవాడ నగరం గురించి కొంచం చెప్పుకుందాం. పాండవమధ్యముడు, అర్జునుడు ఇక్కడ ఇంద్రకీలాద్రి పర్వతం మీదే కిరాతుడి రూపంలో ఉన్న శివుడితో యుద్ధం చేసి, శివుడ్ని మెప్పించి, వరంగా పాశుపతాస్త్రాన్ని పొందాడు. అప్పటినుంచీ అర్జునుడికి విజయుడు అన్న పేరు వచ్చింది. విజయుడు విజయం పొందిన ప్రాంతం కనుక ఈ ఊరి పేరు విజయవాటిక, విజయవాడ అయ్యింది. అర్జునుడు ఆ కాలంలో శివుడి గురించి తపస్సు చేసుకొన్న ఆ ఆలయమే విజయేశ్వరస్వామి ఆలయం. ఇది ఇంద్రకీలాద్రి కిందనే ఉన్నది. ఈ ఆలయం పాండవుల కాలం నాటి దన్న విషయాన్ని సూచించే శిలా శాసనం కూడా ఇక్కడ ఉంది. ఈ వివరాలన్నీ భారవి రాసిన కిరాతార్జునీయం అనే సంస్కృత కావ్యంలో ఉంది. అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మ గురించి కొద్దిగా రాస్తే చాలదు. పూర్తిగా వేరే పోస్ట్ రాస్తాను. తరువాత మొఘల్స్ కాలంలో ఇక్కడే ఒక హజరత్ బల్ దర్గా వచ్చింది. దాంట్లో వారి ప్రవక్త మహమ్మద్ వెంట్రుక ఉంది. దాన్ని సంవత్సరానికో సారి భక్తులకి చూపిస్తారు. ఆ మతానుయాయులకి అది ఒక పవిత్ర ప్రదేశం. ఇలాంటిదే మరొక వెంట్రుక మరో హజరత్ బల్ దర్గా కాశ్మీర్ రాష్ట్రం లోని శ్రీనగర్ లో ఉంది. ఆ తరువాత ఇంగ్లీషు వాళ్ళు విజయవాడ వచ్చి ఇక్కడి మండే ఎండలు చూసి దడుచుకుని ఈ ఊరుని బ్లేజ్ వాడ అన్నారు. నెమ్మదిగా రానురానూ అది బెజవాడగా మార్పు చెందింది. ప్రస్తుతం ఇక్కడ మండుతున్న ఎండల గురించిన సందర్భం కనుక బ్లేజ్ వాడ అనే పేరుని పైన వాడాను.
ఆ పది రోజుల్లోనే ఇంకో ముచ్చట కూడా జరిగింది. విజయవాడ పెదనాన్న ఇంట్లో నీళ్ళకి బావి ఉంది, దానికి మోటార్ ఉంది. స్విచ్ వేస్తె చాలు, నీళ్లు టాపుల్లో వచ్చేవి. ఓ రోజు మోటార్ పాడైంది. పెదనాన్న పెద్ద వాటర్ ట్యాంక్ తెప్పించాడు. కానీ ఆ నీళ్లు పైకి ఎలా ఎక్కుతాయి, మోటార్ లేదు కదా. ఇలాంటి సందర్భాల్లో పనులు చేయటంలో, చేయించటంలో మా సాంబాబాయ్ బెస్ట్. మా అందరినీ పిలిచి బకెట్లు ఇచ్చి నీళ్లు మాతో పైకి మోయించాడు. మేము సుమారు 40 మంది దాకా ఉండటంతో, ఏ ఒక్కరికీ బకెట్ పక్కవాళ్ళకి ఇవ్వటమే కానీ మోయాల్సిన అవసరం రాలేదు. ఒక్కో మెట్టు మీద ఒక్కోళ్లు నుంచుని ఈజీగా మోసేసాం. అందరం ఎంతో సరదాగా టాంకుడు నీళ్లన్నీ పైకి మోసేసాం. "సాధీ, హాథ్ బఢానా, ఏక్ అకేలా థక్ జాయేగా, మిల్ కర్ బోఝ్ ఉఠానా" నయాదౌర్ సినిమాలో లాగా ఇంతమంది ఉండేసరికి పని తేలిగ్గా అయిపొయింది. రామదండు కలిసి రామసేతు కట్టినట్టు, మా దండు అందరం కలిసి పెద్ద పని చేసినా, ఆడుతూ, పాడుతూ సరదాగా చేసేశాం.
ఇప్పుడు చెప్పండి, నేను పెట్టిన టైటిల్ తప్పా? ఇవన్నీ మా కుటుంబంలో సంబరాలు కావా? అయినా పెద్దవాళ్లు పోతే వాళ్ళ తద్దినాలు పండగల్లాగా చెయ్యాలి అని ఆ పెద్దలు చెప్పిందే కదా. మొత్తం మీద ఆ పది రోజులూ ఇంత సందడి సందడిగా కాలం గడిపి అందరం మళ్ళీ ఎవరి గూటికి వాళ్ళు చేరుకున్నాం, మళ్లీ సంవత్సరం ఆబ్దీకం కోసం ఎదురుచూస్తూ.
I vaguely remember the water crisis incident and how we all kids did our duty by standing on stairs with little water containers! 😄❤️
రిప్లయితొలగించండిVery nice we can never get back those days children these days have no such fun hatsoff for your memory
రిప్లయితొలగించండిMay I know who is this?
తొలగించండి