నందివాడ ఆనందరామయ్యగారి వంశవృక్షం 



భట్టిప్రోలు విజయలక్ష్మి 


                                                         మా తాతయ్యగారిపేరు, ఆనందరామయ్య అనే ఆనందరామశాస్త్రి అని మా పెద్ద పెదనాన్న తన స్వహస్తాలతో రాసుకున్న వంశవృక్షం కాపీ లో నేను చూసాను. ఆ రాతప్రతిలో నందివాడ వంశ మూలపురుషుడు నందివాడ వెంకయ్య గారు అని రాశారు. అప్పటినుంచీ మా తాతగారిది ఏడవ తరం. నేను ఆ పై తరాల వారందరినీ వదిలేసి, కేవలం మా తాతగారి తరం నుంచీ మొదలుపెట్టి, ఒక నాలుగు తరాల వివరాలు మాత్రమే రాయాలని నన్ను నేను నియంత్రించుకున్నా. నాకు నేను ఒక పరిమితిని పెట్టుకున్నది ఎందుకంటే, వివరాలు సేకరించటం కష్టమైపోయింది. అలా అని ఏమీ చేయకుండా, లేదా వివరాల సేకరణలోనే ఎక్కువ కాలం గడిపేస్తే, ఇక రాయటం ఎప్పుడు? అందుకే నాకై నేను మాపిల్లల తరం వరకు మాత్రమే అనే నిబంధనను పెట్టుకున్నా. కానీ  మా ఒక్క మా కుటుంబం గురించి మాత్రం సంపూర్తిగా రాస్తాను. అది ఒక నమూనాగా తీసుకుని మీరు అందరూ కూడా, మీ కుటుంబ వివరాలన్నీ కూడా నమోదు చేసి నాకు పంపించండి, లేదా, మీరే ఈ వంశవృక్షానికి జత చేసి పదిలపరచుకోండి. కనుక నేను ఇప్పుడు, తాతగారు, నాన్న తరం, మా తరం, మా పిల్లల తరం వరకు రాస్తున్నాను. ఇప్పుడు వివరాలలోకి వెళదాం. 

                                                                      ముందుగా తాతయ్య గారైన ఆనందరామయ్య గారి తాతయ్య గారు నందివాడ వెంకయ్య గారు, వారి భార్య అంటే, ఆనందరామయ్య గారి బామ్మ గారు, మహాలక్ష్మమ్మ గారు, ఇంకా తాతయ్య గారి తండ్రి, నందివాడ వెంకట సుబ్బారాయుడు, తాతయ్య గారి తల్లి, సుబ్బమ్మ గారిని తలచుకుని నమస్కరించుకుంటూ మన తాతయ్యగారి గురించి చెప్పుకుంటూ సాగుదాం.  

మొదటి తరం--నందివాడ వెంకయ్య, మహాలక్ష్మమ్మ 
రెండవతరం--నందివాడ వెంకట సుబ్బారాయుడు, సుబ్బమ్మ 
మూడవతరం--నందివాడ ఆనందరామయ్య, మహాలక్ష్మమ్మ,విజయరామమ్మ  


                                                   ఇప్పుడు మన తాతయ్య గారి వద్దకు వద్దాం. ఆయన పేరు ఆనందరామశాస్త్రి. కానీ అందరికీ ఆనందరామయ్య గానే పరిచితుడు. ఆయన సంస్కృత పండితుడు. వ్యవసాయం చేసేవారు. ఎవరైనా వేదం చెప్పమని వస్తే వేదపాఠాలు చెప్తూ ఉండేవారు. నిత్యాగ్నిహోత్రి. వారి అక్కగారైన ఆదెమ్మ గారి భర్త నండూరు సీతారామశాస్త్రిగారు చిన్న వయసులోనే కాలం చెయ్యటంతో, అక్కగారి పొలాల నిర్వహణార్ధం ఆనందరామయ్యగారు నందివాడ నుంచి ఆరుగొలను వలస వచ్చారు. అప్పట్లో వారికి ఈ సందర్భంగా 15 ఎకరాల భూమిని కూడా ఆదెమ్మ గారు ఇచ్చారట.  ఆదెమ్మ గారికి ఇద్దరు కూతుళ్లు. పొలం 300 ఎకరాలుండేది. ఆనందరామయ్య గారే ఆ ఇంటికి మగదిక్కుగా ఉండేవారు. ఆదెమ్మగారి పిల్లల పెళ్లిళ్లు అయ్యాక ఆ పెత్తనమంతా ఆదెమ్మగారి అల్లుళ్లు చూసుకునేవారు. ఆనందరామయ్య గారి చెల్లెల్లు లక్ష్మీనరసమ్మ గారు కూడా బాలవితంతువు. ఆమె కూడా అన్నగారి దగ్గరకు చేరి చివరివరకూ అన్నగారి తోనే వుండి, చరమదశలో ఉత్తరదేశ యాత్రకు వెళ్లి, అక్కడ బదరీలో బ్రహ్మకపాలంలో పిల్లలు లేని కారణం చేత తనకు తానే ఆత్మపిండం వేసుకుని, తిరుగుయాత్రలో హరిద్వార్ లో గంగానదిలో మునిగిపోయి తనువు చాలించారు. మేనల్లుళ్ళకీ, మేనకోడళ్లకీ ఆమె చాలా ప్రేమతో పెంచి పెద్ద చేసింది. ఈమె సహాయం లేకపోతే మా బామ్మ ఇంత పెద్ద కుటుంబసాగరాన్ని ఈదలేకపోయేది. అన్నగారికి మొదటి భార్య పోయాక మళ్ళీ పెళ్లి చేసింది. అందరూ ఆమెనెంతో ప్రేమించేవారు. ఆవిడ గుర్తుగా పిల్లలకు ఆవిడ పేరు కూడా పెట్టుకున్నారు. 
      
                                                          ఆనందరామయ్యగారి భార్య పేరు మహాలక్ష్మి, ఈవిడని మంచమ్మ గారనేవారు. ఈమె ఆనందరామయ్యగారి పెద్దకొడుకు, నందివాడ ఫాలలోచనరావు గారిని కని, నెల రోజులలోపే మరణించింది. అప్పటి నుంచీ ఆ పిల్లవాడిని మేనత్తలు, అమ్మమ్మగారు పెంచారు. ఆ తరువాతే ఆనందరామయ్య గారు నండూరు శ్రీరామమూర్తిగారి రెండో కూతురు విజయరామమ్మ గారిని పెళ్లాడారు. విజయరామమ్మగారు వియ్యమ్మ గారనే పేరుతో ఆరుగొలనులో సుప్రసిద్ధులు. ఆవిడే మాకందరికీ బామ్మగారు. మంచమ్మ గారు ఎవరికీ ఎక్కువ తెలియదు. ఆనంద రామయ్య గారి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లలో నాకు ఈ కథ చెప్పటానికి  అవసరం పడినంత వరకూ  మాత్రం వారిని ఇక్కడ ఉదాహరిస్తున్నాను. 

నందివాడ ఆనందరామయ్య అనే ఆనందరామశాస్త్రి      
మహాలక్ష్మి అనే మంచమ్మ,
విజయరామమ్మ అనే వియ్యమ్మ 
ఆనందరామయ్య గారి అక్కగారు ఆదెమ్మగారు, చెల్లెలు లక్ష్మీ నరసమ్మ గారు 
తమ్ముడు రాజగోపాలం గారు 

                                                                ఇక ఆనందరామయ్యగారి పెద్దకొడుకు ఫాలలోచనరావు గారి కుటుంబం గురించి చెప్పుకుందాం. ఫాలలోచనరావు గారు వకీలు, సంస్కృత పండితుడు. ఆ రోజుల్లోనే బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. గుడివాడలో లా ప్రాక్టీస్ చేసి తరువాతి కాలంలో పిల్లలతో పాటు హైదరాబాద్ వచ్చేసినా, హైకోర్ట్ లో కూడా ఎన్ రోల్ అయ్యి ప్రాక్టీస్ కొనసాగించారు. ఆమ్మ పేరు రాజ్యలక్ష్మి. వీరికి మొత్తం ఆరుగురు సంతానం. అందులో ఇద్దరు పసి వయసులోనే కన్ను మూసారు. మిగిలిన నలుగురిలో పెద్దది, మా తరం లో మొదటి ఆడపిల్ల, మా అందరికీ పెద్దక్క పరమేశ్వరి. చేవేండ్ర సూర్యారావు గారితో వివాహం చేసారు. వారికి లక్ష్మీకుమార్, రాజ్యలక్ష్మి, మాలతి ముగ్గురు సంతానం. తరువాత శ్రీదేవి అక్కయ్య. ఈమెకు   కృత్తివెంటి సూర్యప్రకాశరావుగారితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు. లక్ష్మీప్రసాద్, సుధాకర్, రమణమూర్తి. ఆ తరువాత హృషీకేశం అన్నయ్య, వదిన పేరు సత్యవతి. పిల్లలు శాంతి, విజయసారధి. ఈ కుటుంబం ఆధ్యాత్మికంగా వున్నత స్థితిలో వున్నారు. తరువాత సుబ్రహ్మణ్యం, అందరికీ మా సుబ్బులన్నయ్య. వదిన జానకి. ఇద్దరూ భలే అందంగా వుంటారు. ఒక అమ్మాయి సౌజన్యని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు. ఆ తరువాత వెంకటరామ్ అన్న పిల్లవాడు పుట్టినప్పుడే రాజ్యలక్ష్మి గారు జబ్బు చేసి చనిపోయారు. ఆ పిల్లవాడూ మూడు నెలల కన్నా బతకలేదు. ఫాలలోచనరావు గారు ఇక మళ్ళీ పెళ్లి చేసుకోనని శపధం చేశారని చెప్తారు. జీవితాంతం ఆ మాట మీదే నిలబడ్డారు కూడాను. ఆ దిగులుతోనే ఆనందరామయ్య గారు పోయారని అంటారు. 

1. ఫాలలోచనరావు---రాజ్యలక్ష్మి 
    పరమేశ్వరి---చేవేండ్ర సూర్యారావు---లక్ష్మీ కుమార్, రాజ్యలక్ష్మి, మాలతి 
    శ్రీదేవి---కృత్తివెంటి సూర్యప్రకాశరావు---లక్ష్మీ ప్రసాద్, సుధాకర్, రమణమూర్తి 
    హృషీకేశం---సత్యవతి---రాజ్యలక్ష్మీ కామేశ్వరీ శాంతి, విజయసారథి
    కల్యాణ సుందరం 
    సుబ్రహ్మణ్యం---జానకి---సౌజన్య 
    వెంకటరామ్ 

                                                                   ఆనందరామయ్య గారు, విజయరామమ్మ గార్ల మొదటి సంతానం బాలాత్రిపురసుందరి. ఈ పాప కూడా ఎక్కువ రోజులు బతకలేదు. 

2. బాలాత్రిపురసుందరి---చిన్నప్పుడే చనిపోయింది 


                                                                   ఆ తరువాత పుట్టింది ఉమామహేశ్వరరావుగారు. మా ఉమా పెదనాన్న. ఆనందరామయ్య గారి సంతానంలో మూడవవాడు. విజయరామమ్మ గారికి పెద్దకొడుకు. బామ్మ ఎప్పుడూ ఉమాయ్, ఉమాయ్ అని ఈయనను కలవరిస్తూ ఉండేది. ఆమ్మ అన్నపూర్ణ. ఆవిడ పేరుకే కాకుండా నిజంగానూ అన్నపూర్ణే. వాళ్లకు పదిమంది పిల్లలు. పెద్దన్నయ్య చక్రధరరావు, పెద్దవదిన శారదాదేవి, వారి పిల్లలు పద్మశ్రీ, వాణిశ్రీ, గాయత్రి. రెండో అన్నయ్య, మురళీధరరావు. చిన్నన్నయ్యా అంటాం. ఆమ్మ పోయాక, పెదనాన్న కాస్త మెత్తబడినా ఇంట్లో బాధ్యతగా పెళ్లి పేరంటాలన్నీ చక్కగా పెదనాన్న స్థాయికి తగ్గకుండా నిర్వహించినవాడు. చిన్నవదిన సుశీలాదేవి. వాళ్ళ పిల్లలు, కిరణ్మయి, హిరణ్మయి, విజయమహేష్. మూడో అన్నయ్య మాధవరావు, వదిన ప్రసన్న. పిల్లలు అనుపమ, నిరుపమ. నాలుగో అన్నయ్య ప్రేమానంద్, భార్య లక్ష్మి, పిల్లలు రాణి, శాంతి. న్యూజెర్సీలో అందరికీ పెద్దదిక్కు. తరువాత ఇందిరాదేవి. ఆడపిల్లల్లో పెద్దది. భర్త పేరు పాలెపు లక్ష్మీనృసింహశర్మ, పిల్లలు ఆనంద్, అరవింద్. తరువాత అనూరాధ. భర్త పత్రి రాఘవ, కొడుకు రాహుల్. ఆ తరువాత శ్రీలక్ష్మి. భర్త పర్చా దివాకర్, పిల్లలు అశ్విన్, యశ్వంత్. ఆ  తరువాతది జయశ్రీ. భర్త కూచిమంచి సూర్య, పిల్లలు నరసింహ నవనీత్ దీక్షిత్, దర్శి పూర్ణిమా దీక్షిత్. చివరి ఆడపిల్ల బాలా త్రిపురసుందరి. పెదనాన్న, తన చనిపోయిన అక్క గుర్తుగా ఈ పేరు పెట్టుకున్నాడట. బాల భర్త కొమ్మూరి శివ, పిల్లలు వర్ష, విష్ణు. అందరికన్నా చివరివాడు ప్రభాకర్. భార్య పేరు భవాని, కూతురు మహిమ. ఇదీ ఉమాపెదనాన్న కుటుంబం.  

3.  ఉమామహేశ్వరరావు---అన్నపూర్ణ 
      చక్రధరరావు---శారదాదేవి---పద్మశ్రీ, వాణిశ్రీ, గాయత్రి 
       మురళీధరరావు---సుశీలాదేవి---కిరణ్మయి, హిరణ్మయి, విజయమహేష్ 
       మాధవరావు---ప్రసన్న---అనుపమ, నిరుపమ 
       ప్రేమానంద్---లక్ష్మి---రాణి, శాంతి
       ఇందిరాదేవి---పాలెపు లక్ష్మీనృసింహశర్మ---ఆనంద్, అరవింద్
       అనురాధ---పత్రి రాఘవ---రాహుల్ 
       శ్రీలక్ష్మి-- పర్చా దివాకర్---అశ్విన్, యశ్వంత్ 
       జయశ్రీ---కూచిమంచి సూర్య---నరసింహ నవనీత్ దీక్షిత్, దర్శి పూర్ణిమాదీక్షిత్  
      బాలాత్రిపురసుందరి---కొమ్మూరి శివ---వర్ష, విష్ణు 
      ప్రభాకర్---భవాని---మహిమ 

                                                                  ఆనందరామయ్య గారు, విజయరామమ్మ గార్ల తరువాతి సంతానం నందివాడ మధుసూదనరావు గారు. ఆమ్మ పేరు కృష్ణవేణి. ఈ పెదనాన్న మొట్టమొదటిసారిగా మన ఆంధ్రదేశంలో ట్యుటోరియల్ కాలేజీ పెట్టిన వ్యక్తి.  బనారస్ మెట్రిక్ కి చదివించి, అందరినీ బనారస్ తీసుకు వెళ్లి పరీక్షలు రాయించి, పాస్ చేయించి ఎంతోమందికి  విద్యాబిక్ష పెట్టిన వ్యక్తి. ఆ రోజుల్లో ఆ మెట్రిక్ సర్టిఫికెటుతో చక్కగా గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికేవి. ఈయన దుర్గా ట్యుటోరియల్ కాలేజీలో మానాన్న, సాంబుడు బాబాయ్ కూడా పనిచేశారు. పిల్లలు లీల, భర్త సురేశన్, పెంపుడు కొడుకు శ్రీనివాస్, భార్య పరిమళ. ఇదీ మధు పెదనాన్న కుటుంబం. 

4. మధుసూదనరావు---కృష్ణవేణి
    లీల---సురేశన్ 
    శ్రీనివాస్---పరిమళ 


                                                              తరువాత మా పెద్దత్తయ్య, కనకదుర్గాంబ. పెద్ద మామయ్యగారు దాలిపర్తి సత్యనారాయణ గారు. వీరికి ఒక్కడే కొడుకు. దత్తుడు. సరోజినీ అత్తయ్య పెద్దకొడుకుని పెద్దత్తయ్య దత్తు తీసుకుంది. ఆ అబ్బాయే శాయి విఠల్, భార్య ఉషారాణి. వాళ్లకి ఇద్దరు కొడుకులు వాసుదేవ మాలిక్, అనంత్ సూరజ్.   

5. కనకదుర్గాంబ---దాలిపర్తి సత్యనారాయణ
  శాయివిఠల్---ఉషారాణి---వాసుదేవమాలిక్, అనంత్ సూరజ్   



                                                       తరువాత నందివాడ హరినారాయణరావు గారు. హరిరావు అని అంటారు. ఆమ్మ పేరు స్వరాజ్యలక్ష్మి. అందరం రాజ్యం ఆమ్మ అంటాం. చాలా యేళ్ల పాటు ఆవిడపేరు స్వరాజ్యలక్ష్మి అని నాకు తెలియదు. వీళ్ళ సంతానం పెద్దవాడు రామానంద్, వదిన సుమిత్ర, పిల్లలు హిమప్రద, హరిప్రియ. రెండో అన్నయ్య పేరు శివానంద్, వదిన బాలనాగేశ్వరి, పిల్లలు అనీష, హరి తరుణ్. ఆ తరువాత శ్రీమహాలక్ష్మి, బుచ్చిపాప అంటాం. హరి పెదనాన్న తన చచ్చిపోయిన చెల్లెలి గుర్తుగా ఆవిడ పేరు, ముద్దుపేరు కూడా మా అక్కయ్యకి పెట్టేసాడు. భర్త నీలంరాజు రామకృష్ణ, కూతురు శుభప్రద. ఆ తరువాత పుండరీకాక్షశర్మ. అందరం పుండరీ అంటాం. వదిన కమల. పిల్లలు హరి కశ్యప్, హరి కౌశిక్. తరువాత విజయశ్రీ. భర్త క్రమధాటి లక్ష్మీప్రసాద్. ఆ తరువాత లక్ష్మీశ్రీ. దీన్ని ఉషా అనేవాళ్ళం. అసలు పేరు లక్ష్మీనరసమ్మ. పెదనాన్న వాళ్ళ అత్తయ్య గుర్తుగా పెట్టుకున్నాడు. భర్త గుండిమెడ హనుమంతరావు, కొడుకు పేరు అనిరుధ్. చివరివాడు కృష్ణమోహన్. భార్య జానకి. పిల్లలు మనస్విని, తేజస్విని. ఇదంతా హరి పెదనాన్న కుటుంబం.    

6. హరినారాయణరావు---స్వరాజ్యలక్ష్మి 
      రామానంద్---సుమిత్ర---హిమ, హరిప్రియ
      శివానంద్---బాలనాగేశ్వరి---అనీష, హరి తరుణ్
     శ్రీమహాలక్ష్మి---నీలంరాజు రామకృష్ణ---శుభప్రద  
     పుండరీకాక్షశర్మ---కమల---హరికశ్యప్, హరికౌశిక్ 
     విజయశ్రీ---క్రమధాటి లక్ష్మీప్రసాద్
     లక్ష్మీశ్రీ---గుండిమెడ హనుమంతరావు---అనిరుధ్ 
     కృష్ణమోహన్---జానకి---మనస్విని, తేజస్విని 

                                       ఆనందరామయ్య గారు, విజయరామమ్మ గార్ల తరువాతి సంతానం నందివాడ సుబ్బరాయశర్మ. ఈ పెదనాన్నని చిన్నప్పుడే ఆనందరామయ్యగారు తన తమ్ముడు రాజగోపాలం గారికి పిల్లలు లేకపోవడంతో దత్తత ఇచ్చారు. ఆ కారణంగా దత్తు వెళ్లినా ఇంటిపేరు గానీ, గోత్రం గానీ మారలేదు. ఆమ్మ పేరు సీతారాం. ఈ ఆమ్మ కూడా వాళ్ళ కజిన్ మంగమ్మ గారి కూతురే. వీళ్ళ పెద్దకూతురు కనకదుర్గ, బావగారు సత్యనారాయణ. ఈ ఇద్దరివీ మళ్ళీ మా పెద్దత్తయ్యా, పెద్దమామయ్య గారి పేర్లే. వాళ్ళ పిల్లలు పద్మజ, రాజశేఖర్. తరువాత అన్నయ్య శేషు బదరీ నారాయణ, వదిన రుక్మిణి. పిల్లలు చంద్రకిరణ్, స్వరూప, హిమబిందు. తరవాత లక్ష్మక్కయ్య, మళ్ళీ వాళ్ళ మేనత్త లక్ష్మీనరసమ్మ గారి పేరు పెట్టుకున్నారు శర్మ పెదనాన్న. లక్ష్మక్కయ్యని కూడా ఆ పేరు పాతకాలందిగా ఉందని అందరూ నీలూ అనటం అలవాటు చేసుకున్నారు. భర్త ప్రేమానంద్, పిల్లలు రాణీ, శాంతీ. ఆ తరువాత రాజరాజేశ్వరి, భర్త తంగిరాల శ్యాంసుందర్ లాల్, పిల్లలు చంద్ర, నీలిమ. తరువాతది రాధారాణి. భర్త అధీర్ చంద్ర పాల్, కొడుకు చైతన్య అనిల్ కుమార్ పాల్. చివరివాడు రాజగోపాల్, భార్య విశాలి, పిల్లలు సెలెనా, సిద్ధార్థ్. ఇది శర్మ పెదనాన్న కుటుంబం. ఈ పెదనాన్నకి పాపాయి అని మరో ముద్దు పేరు కూడా వుంది.  

7సుబ్బరాయశర్మ---సీతారాం,
    కనకదుర్గ---బుద్ధవరపు సత్యనారాయణ---పద్మజ, రాజశేఖర్
    శేషుబదరీనారాయణ--రుక్మిణి---స్వరూప, హిమబిందు, చంద్రకిరణ్
    లక్ష్మీనరసమ్మ---ప్రేమానంద్---రాణి, శాంతి
    రాజరాజేశ్వరి---తంగిరాల శ్యాంసుందరలాల్---చంద్ర, నీలిమ
    రాధారాణి---అధీర్ పాల్---చైతన్యఅనిల్ కుమార్ పాల్ 
    రాజగోపాల్---విశాలి---సెలీనా, సిద్ధార్థ్ 

                                                 తరువాత బుచ్చిపాపత్తయ్య, మామయ్యగారు మెట్టపల్లి శేషగిరిరావుగారు. ఈ అత్తయ్య అసలు పేరు శ్రీ మహాలక్ష్మి. హరిపెదనాన్న ఈ అత్తయ్య మీద ప్రేమతో వాళ్ళ పెద్దమ్మాయికి ఆ పేరు పెట్టాడు. పెళ్లి అయిన కొద్ధి నెలలకే అత్తయ్యకి ఏదో విషజ్వరంట, వచ్చి చనిపోయింది. యెంత వైద్యం చేయించినా లాభం లేకపోయిందట. మామయ్యగారికి అత్తయ్య అంటే చాలా ఇష్టం వుండేదిట. ఆయన తరువాతి రోజుల్లో 'కాదంబరి' అనే కలం పేరుతో 'ఇందుమతి' అన్న నవల రాసి ఆంధ్రప్రభ నవలల పోటీలో ప్రైజ్ తెచ్చుకున్నారు. అందులో ఇందుమతి ఈ అత్తయ్య, కుటుంబంలోని అందరినీ ఆ నవలలో చూపించారు.  ఆ సీరియల్ వచ్చేరోజుల్లో బామ్మ ఆ కథ నాతో చదివించుకుని ఏడుస్తూ ఉండేది. ఆవిడ చదవలేదు, ఆ రోజుల్లోనే కంటికి ఆపరేషన్ అయ్యింది మరి. 

8.  శ్రీమహాలక్ష్మి---మెట్టపల్లి శేషగిరిరావు 

                                                           తరువాత అత్తయ్య చెల్లమ్మత్తయ్య. అసలు పేరు లక్ష్మీ సరస్వతి. శర్మ పెదనాన్న ఈ అత్తయ్య పుట్టంగానే చెల్లమ్మ పుట్టింది, చెల్లమ్మ పుట్టిందీ అని అరిచి అందరికీ చెప్పాట్ట. అంటే, ఈవిడ పేరు చెల్లమ్మ అయి కూర్చుంది. మామయ్యగారు పారుపల్లి కాకుళేశ్వరరావుగారు. వీళ్ళకి గిరిజ పెద్దకూతురు, భర్త తిప్పరాజు మురళీమోహన్, పిల్లలు శైలజ, శాలిని. రెండోది లలిత, భర్త దినవహి హనుమంతరావు. పిల్లలు అనిత, సునీత, అనంత.  మూడోది సత్యరమాదేవి, భర్త పింగళి విజయశేషగిరి. పిల్లలు విజయమాధురి, విజయ శాయి భరద్వాజ్. తరువాతది నాగదుర్గ. ఆ తరువాత శ్రీనివాస్, భార్యపేరు భారతి. పిల్లలు రామకృష్ణ నీహార్, శ్యామ్ మల్హర్. అత్తయ్య తన మనవళ్ళకి ఈ పేర్లు కావాలని తన అన్నదమ్ముల పేరు మీదుగా పెట్టుకుంది వాళ్ళ మీద ఇష్టంతో.   

9. లక్ష్మీసరస్వతి---పారుపల్లి కాకుళేశ్వరరావు 
    గిరిజ--తిప్పరాజు మురళీమోహన్---శైలజ, శాలిని
    లలిత--- దినవహి హనుమంతరావు---అనిత, సునీత, అనంత
    సత్యరమాదేవి---పింగళి విజయశేషగిరి---విజయమాధురి, విజయశాయిభరద్వాజ్ 
    నాగదుర్గ
    శ్రీనివాస్---భారతి---రామకృష్ణ నీహార్, శ్యామ్ మల్హర్ 

                                                                         ఇక ఇప్పుడు మా కుటుంబం. నాన్న పేరు నందివాడ శ్రీ రామకృష్ణ శర్మ. "మా నాన్నే నా పేరులో శ్రీ అని పెట్టేసారు. ఇక ఎవ్వరూ శ్రీ అనాలన్నా శ్రీశ్రీ అనాల్సిందే" అని మా నాన్న జోకులేసేవాడు. అమ్మపేరు లీలాకుమారి. నేను పెద్దదాన్ని, నాపేరు విజయలక్ష్మి. మా వారి పేరు భట్టిప్రోలు రమేష్ కుమార్. మాకిద్దరు పిల్లలు. పెద్దవాడు ప్రమోద్, పెద్దకోడలు మిథున, మనవరాలు షోడశి, మనవడు ధృవ్. రెండో వాడి పేరు ప్రదీప్, రెండో కోడలు మానస, మనవళ్ళు అద్వైత్, నివీత్ చివరిలో నేను మా కుటుంబం గురించి కొంచం వివరంగా రాస్తాను. మిగిలిన అందరూ కూడా ఇదేవిధంగా రాసుకుని తయారు చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. నా తరువాత భారతలక్ష్మి, దాని భర్త పేరు విస్సా వేంకటేశ్వరరావు. పిల్లలు సుధీర్ చంద్ర, సుస్మిత. ఆ తరువాత పద్మావతి, దాని భర్త పేరు రాజశేఖరుని శ్రీనివాసరావు. పిల్లలు శ్రీకాంత్, శ్రీరాజిత. శ్రీరాజిత నాన్న పోయిన తరువాత పుట్టింది. పద్మ మానాన్న పేరులోని మొదటి రెండు అక్షరాలూ వచ్చేలా దానికి శ్రీరాజిత అని పేరు పెట్టింది. తరువాతి మా అందరిలో చిన్నవాడు వివేకానంద్, భార్య కల్పన. పిల్లలు హర్ష కృష్ణ, నేహా లక్ష్మి. అమ్మకు ఆ తరువాత కూడా వరలక్ష్మి అనే పాపాయి పుట్టి, మూడేళ్లకే చనిపోయింది. అలాగే నాకన్నా ముందు ఆనంద్ అనే అబ్బాయి పుట్టి వాడూ అయిదు నెలలకే పైకెళ్లిపోయాడు. ఇదీ మా కుటుంబం వివరం.   

10. శ్రీరామకృష్ణశర్మ---లీలాకుమారి 
       విజయలక్ష్మి---భట్టిప్రోలు రమేష్ కుమార్---ప్రమోద్, ప్రదీప్ 
       భారతలక్ష్మి---విస్సా వెంకటేశ్వరరావు---సుధీర్ చంద్ర, సుస్మిత  
       పద్మావతి---రాజశేఖరుని శ్రీనివాసరావు---శ్రీకాంత్, శ్రీరాజిత 
       వివేకానంద్---కల్పన---హర్షకృష్ణ, నేహాలక్ష్మి 


                                                                   మా నాన్న తరువాత పుట్టింది మా సరోజినీ అత్తయ్య. పూర్తిపేరు లీలా సరోజిని. ఈ  అత్తయ్య చాలా తెలివి కలది, ఎంతో  సృజనాత్మకత గలది. ఏ పని చేసినా అందంగా పొదుపుగా శుభ్రంగా చేసేది. చదువు పిచ్ఛది, నాలాగే (లేకపోతే నేను ఆవిడలాగా). పిల్లలనందరినీ బాగా చదివించింది. మామయ్యగారు ముళ్ళపూడి సుబ్బారావు గారు. పెద్ద కొడుకుని పెద్దత్తయ్యకి దత్తత ఇచ్చింది. రెండో వాడు లలితానందసాయి, భార్య రాజ్యలక్ష్మి. కొడుకులు, లాలిత్య, శ్రీకర్. తరువాతి వాడు విశ్వేశ్వరసాయినాథ్, విశ్వం అంటాం. భార్య పేరు పద్మ, ఒక కొడుకు, పేరు సాయి వినయ్. తరువాత వాడు రామశేషసాయి. గొప్ప సైంటిస్ట్. భార్య సరోజ. కూతురు దివ్య. చివరిది లక్ష్మీరాధిక, అన్నలందరికీ ముద్దుల చెల్లెలు. భర్త ఎరగుడిపాటి రమణారావు, కూతురు కిరణ్. ఇదేమో మా సరోజినత్తయ్య కుటుంబం.     

11. లీలా సరోజినీ---ముళ్ళపూడి సుబ్బారావు
      లలితానందసాయి---రాజ్యలక్ష్మి---లాలిత్య, శ్రీకర్ 
      విశ్వేశ్వరసాయినాథ్---పద్మ---సాయి వినయ్ 
      రామశేషసాయి---సరోజ---దివ్య 
       లక్ష్మీ రాధిక---ఎరగుడిపాటి రమణారావు---కిరణ్ 


                                                          బామ్మ, తాతయ్యల సంతానంలో తరువాతి వాడు నందివాడ సాంబశివరావు. చాలా తెలివైన వాడు. కుటుంబంలో మొట్టమొదటి డాక్టరేట్ పొందిన వ్యక్తి. నిదానస్తుడు. పిన్ని పేరు ఉమాదేవి. వీళ్ళ పిల్లల్లో పెద్దది, లక్ష్మీ శారద, భర్త కోటంరాజు ప్రదీప్. రెండవది లక్ష్మీపద్మ, భర్త పేరు కోన సుభాష్. పిల్లలు మానస, మోహన. తరువాత రవిశంకర్, భార్య సురేఖ, కూతురు ఆన్య. చివరిది శ్రీవల్లి.   

12. సాంబశివరావు---ఉమాదేవి 
      లక్ష్మీ శారద---కోటంరాజు ప్రదీప్ 
      లక్ష్మీపద్మ---కోన సుభాష్---మానస---మోహన 
      రవిశంకర్---సురేఖ---ఆన్య 
      శ్రీవల్లి 


                                                                      చిట్టచివరివాడు నందివాడ శ్రీధరరావు. ఈయన మొత్తం కుటుంబం లో USA కి వెళ్లిన మొదటివాడు. ఆ తరువాత తామర తంపరగా ఇప్పుడు 75 శాతం మంది USA లో ఉంటే మిగిలిన 25 శాతం మంది మాత్రమే ఇక్కడ మిగిలారు. 45 ఏళ్లుగా అక్కడే ఉంటున్నా, ఇక్కడున్న అందరికీ ఆయన ఇక్కడే ఉన్నట్టు అనుభూతి కలిగిస్తూ, అందరినీ మంచీచెడూ కనుక్కుంటూ ఉంటాడు. పిన్ని పేరు సరోజినీ రాణి. అందరం రాణి పిన్ని, రాణత్తయ్య  అంటాం. పిల్లలు గాయత్రీభాను, భర్త ఆచి వెంకట్. రెండోది లక్ష్మీమాలిని. భర్త మైఖేల్ బిఖాఫ్. మూడవది, మా అందరిలో చిన్నది, విజయవాసంతి. భర్త పేరు జోయీ హొఫర్, పిల్లలు పెద్దవాడు ఇయన్ ఆనంద్, కూతురు విజయమాయ, రెండో కొడుకు కిరణ్. 

13. శ్రీధరరావు---సరోజినీరాణి 
       గాయత్రీ భాను---ఆచి వెంకట్ 
       లక్ష్మీ మాలిని---మైఖేల్ బిఖాఫ్  
       విజయ వాసంతి---జోయీ హొఫర్---ఇయాన్ ఆనంద్, విజయమాయ, కిరణ్     

                                                             మొత్తానికి ఇక్కడితో మా నందివాడ కుటుంబంలో మా పిల్లల తరంతో ఈ వంశ వృక్ష పరిచయ వ్యాసం పూర్తి అయ్యింది. ఇప్పటికి సేకరించగలిగిన వివరాలివి. ఎన్నో వూళ్ళల్లో, ఎన్నో రాష్ట్రాలలో, ఎన్నో దేశాలలో, వున్న వారి వివరాలివి. నందివాడ వెంకయ్య, మహాలక్ష్మమ్మ గారిని, నందివాడ వెంకట సుబ్బారాయుడు, సుబ్బమ్మ గారిని సంస్మరించుకుంటూ, మా తాతయ్య గారైన ఆనందరామయ్య గారినీ, మంచమ్మ గారినీ, వియ్యమ్మ గారినీ నమస్కరించుకుందాం. 

                                                                      ఇదంతా నేను సేకరించగలిగిన వివరాలు. నాధోరణిలో,
నా భాషలో చెప్పాలనుకుని ఈ ప్రయత్నం చేసాను. తప్పులుంటే, చెపితే దిద్దుకుంటాను. పైన నేను చెప్పిన పాత తరపు వివరాల కాపీ ఒకటి జీర్ణావస్థలో హృషీ అన్నయ్య దగ్గర ఇప్పటికీ  వుంది. కొత్తగా తెలిసిన విషయం ఏమంటే, ఒక ప్రతి ఉమా పెదనాన్న దగ్గర కూడా ఉందనీ, ఇప్పటికీ విజయవాడ ఇంట్లో వున్నదని తెలిసింది. మాధవన్నయ్య దగ్గర కూడా ఒక ప్రతి ఉందట. ఈ ప్రతులన్నీ ఒకే దాని నకళ్లా, వేరు వేరా అనేది తెలియదు. కాకపోతే ఆ ప్రతులన్నీ ఫ్లో చార్ట్ రూపం లో వున్నాయి. నేను దానికి కాస్త  భిన్నంగా ఈ ప్రయత్నం చేసాను. నమస్తే.            

ఓం ధర్మస్య జయోస్తు 
అధర్మస్య నాశోస్తు 
ప్రాణిషు సద్భావనాస్తు 
విశ్వస్య కళ్యాణమస్తు 
సర్వేజనాః సుఖినో భవంతు
ఓం శాంతిః  శాంతిః శాంతిః







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా అమ్మ

99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ