శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం

              

శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం

Sri Mantramatrukaa Pushpamala Stavam


శ్రీ శంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ మంత్రమాతృకా పుష్పమాలాత్మక నిత్యమానస పూజ!!!

భగవంతుని మనము పంచ పూజ (5 ఉపచారాలు) షోడశోపచార పూజ (16 ఉపచారాలు) చతుష్షష్టి 

పూజ (64 ఉపచారాలు) అని పలువిధములైన ఉపచారాలతో పూజిస్తూ ఉంటాము.

భగవంతునికి నిత్యమూ జరిగే ఉపచారాలు: ధ్యానం, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యం, ఆచమనీయము, పంచామృతస్నానం,శుద్దోదకస్నానం, వస్త్రం, యజ్ఞోపవీతము, ఆభరణములు, గంధము, పుష్పములు, అంగపూజ, స్తోత్రం (అష్టోత్తరం / సహస్రనామావళి ), ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలం, నీరాజనం, ఛత్రం, చామరం, నృత్యం, గీతం, వాయిద్యములు, మంత్రపుష్పం, ప్రదక్షిణం, మొదలగునవి.

శ్రీ మంత్రమాతృకా పుష్పమాలస్తవం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులవారు నిత్యము అమ్మవారిని
మానసికంగా ఎలా షోడశ ఉపచారాలతో పూజించవచ్చో మనకు తెలియ జెప్పారు. 

శ్రీ మంత్రమాతృకా పుష్పమాలలో 17 శ్లోకాలు ఉన్నాయి. అందులో 16 శ్లోకాలు 16 ఉపచారాలకునూ, ఆఖరి శ్లోకం ఫలస్తుతి గాను వర్ణించబడినది.


అంత కంటే అద్భుతమైన విషయం ఏమిటంటే స్వామివారు ఈ స్తోత్రాన్ని పంచదశీ మంత్రానికి అనుసంధానంగా వ్రాసారు. మీరు గమనిస్తే ప్రతీ శ్లోకం మొదటి అక్షరము పంచదశీ మంత్రంలోని బీజాక్షరములతోమొదలవుతుంది. (క..కల్లోలోల్లసితా, ఏ...ఏణాఙ్కానల, ఈ...ఈశనాదిపదం, ల..లక్ష్యే యోగిజనస్య, హ్రీమ్,......)


ప్రశాంతంగా సుఖాసనములో కూర్చోని శ్రీ మంత్రమాతృకా పుష్పమాలను పఠిస్తూ, అమ్మవారిని ధ్యానిస్తూ మనసనే అనే మందిరానికి అమ్మవారిని ఆవాహన చేసి, ధ్యానాది షోడశ ఉపచారాలు చేసుకున్నంత మాత్రాన , మనకు అమ్మవారి కరుణా, కృపా, కటాక్షము సంపూర్ణంగా లభించి, మనస్సుకు, శాంతి, ఆనందం చేకూరుతాయి.

ఉద్యోగస్తులు, భౌతికమైన బాధ్యతలతో సతమత మౌతున్నవారు, తీరిక లేనివారు, ఎవరైనా సరే, నిత్యమూ భగవంతుని ఆరాధించలేకున్నామని చింతిస్తున్న వారందరికీ శ్రీ శంకర భగవత్పాదుల వారు ప్రీతితో ప్రసాదించిన వరము శ్రీ మంతరమాతృకా పుష్పమాల అని చెప్పాలి.


శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా స్తవం ప్రతినిత్యము సంధ్యాసమయములో ఎవరైతే స్తుతిస్తారో వారి సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయి !!!


॥ మన్త్ర మాతృకా పుష్పమాలా స్తవః ॥



కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి-
ద్వీపే కల్పకవాటికాపరివృతే కాదమ్బవాట్యుజ్జ్వలే ।
రత్నస్తమ్భసహస్రనిర్మితసభామధ్యే విమానోత్తమే
చింతారత్నవినిర్మితం జనని తే సింహాసనం భావయే ॥ ౧॥

ఓ అమృతవల్లీ!
నా మనస్సులో ఉపొంగుతున్నపాలసముద్రంలో, అమృతభరితమైన అలల మధ్య, మిక్కిలి తేజోవంతమైన మణిద్వీపము ఒకటి విరాజిల్లుతున్నది. ఆ మణిద్వీపము కల్పక వాటికతో పరివృతమై ఉన్నది. అందు కాదంబ వృక్షములతో కూడిన ఉద్యాన వనములో రత్నావైఢూర్యాలతో నిర్మించబడిన వెయ్యి స్తంభాల మంటప ఉపరిభాగమున, చింతామణులతో నిర్మించిన సింహాసనాన్ని నీకొరకై అమర్చినట్టుగా భావిస్తున్నాను!


ఏణాఙ్కానలభానుమణ్డలలసచ్ఛ్రీచక్రమధ్యే స్థితాం
బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీమ్ ।
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం
తాం త్వాం చన్ద్రకలావతంసమకుటాం చారుస్మితాం భావయే ॥ ౨॥

ఓ బాలాత్రిపుర సుందరీ!
చంద్ర-సూర్య-అగ్నికాంతుల వర్ణముతో ప్రకాశిస్తున్న శ్రీచక్రముపై ఉపస్థితవై (ఆసీనురాలవై), ఎర్రటి వస్త్రమును ధరియించి, ఉదయభానుని కాంతితో ప్రకాశిస్తూ, ప్రసన్నవదనంతో ఒక చేత పాశము, ఒక చేత అంకుశము, ఇంకోచేత ధనస్సు, మరోచేత బాణము ధరించి, చంద్రకళలతో భాసిల్లుతున్న కిరీటముతో మృదు మందహాసముతో దర్శనమిస్తున్నట్టుగా భావిస్తూ నిన్ను నా మనస్సున ధ్యానిస్తున్నాను తల్లీ!


ఈశనాదిపదం శివైకఫలదం రత్నాసనం తే శుభం
పాద్యం కుంకుమచన్దనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః ।
శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం
కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతామ్ ॥ ౩॥

ఓ కారుణ్యామృతవర్షిణీ!
బ్రహ్మ , విష్ణు , ఈశుడు, రుద్రుడు పదములుగాను, సదాశివుడు ఫలకంగా అమర్చిన శుభకరమైన రత్నాలతో నిర్మించిన ఆసనాన్ని నీకు సమర్పిస్తున్నమ్మా! కుంకుమ పువ్వు మరియు చందనంతో కూడిన పాద్యమూ (పాదములను కడుగుటకు), రత్నాలు మరియు అక్షతలతో కూడిన అర్ఘ్యము (చేతులు కడుగుటకు) నిర్మలమైన జలాలు ఆచమనీయము (త్రాగుటకు), నీకు ఇవన్నీ భక్తి శ్రద్దలతో సంతోషముగా మానసికముగా సమర్పిస్తున్నాను, ఇవి నీకు సంతుష్టిని కలిగించుగాక!!


లక్ష్యే యోగిజనస్య రక్షితజగజ్జాలే విశాలేక్షణే
ప్రాలేయాంబుపటీరకుంకుమలసత్కర్పూరమిశ్రోదకైః ।
గోక్షీరైరపి నారికేలసలిలైః శుద్ధోదకైర్మంత్రితైః
స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్ ॥ ౪॥

ఓ విశాలాక్షీ!
నీ విశాలవీక్షణతో లక్షలాది యోగిజనులను, యావత్ జగత్తును రక్షిస్తున్న ఓ జననీ! నీకు ప్రాతఃకాలమున (తెల్లవారుతుండగా) మేలైన కుంకుమపువ్వు, పచ్చకర్పూరము, ఆవుపాలు, కొబ్బరినీళ్లు, వేద మంత్రములతో కూడిన పరిశుభ్రమైన జలములు అభిషేకార్థము (స్నానార్థము) నీకు ఆనందముతో సమర్పిస్తున్నట్టుగా భావిస్తున్నాను, ఇవి నీకు సంతుష్టిని కలిగించుగాక!


హ్రీంకారాంకితమంత్రలక్షితతనో హేమాచలాత్సంచితైః
రత్నైరుజ్జ్వలముత్తరీయసహితం కౌసుంభవర్ణాంశుకమ్ ।
ముక్తాసంతతియజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతూద్భవం
దత్తం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్ ॥ ౫॥

అమ్మా!
హ్రీంకారముతో కూడిన మంత్రముతో తెలియబడు స్వరూపిణి వైన నీకు బంగారు కొండయైన మానస సరోవరములోని ఉజ్వలమైన రత్నాలతో తయ్యారు చేయబడిన ఉత్తరీయమును, ఎర్రటి వస్త్రాన్ని, బంగారు తీగతో చుట్టబడిన మేలిమి ముత్యాల యజ్ఞసూత్రాన్ని సమర్పిస్తున్నట్టుగా భావిస్తున్నాను. ఇవి నీకు సంతుష్టిని కలిగించుగాక!


హంసైరప్యతిలోభనీయగమనే హారావలీముజ్జ్వలాం
హిందోలద్యుతిహీరపూరితతరే హేమాంగదేకంకణే ।
మంజీరౌ మణికుణ్డలే మకుటమప్యర్ధేందుచూడామణిం
నాసామౌక్తికమంగులీయకటకౌ కాంచీమపి స్వీకురు ॥ ౬॥

ఓ లావణ్యవతీ!
హంసలకుకూడా ఈర్ష్యను కలిగించు నడక గల ఓ దేవీ, నీకు మిక్కిలి ప్రకాశవంతమైన హారములను, కూర్చిన బంగారు భుజకీర్తులను, కంకణములను, అందెలను, మణికుండలమును, కిరీటమును, అర్ధచంద్రచూడామణిని, ముక్కుపుడక, నత్తి (బులాకీని), ఉంగరములను, కడియములను, ఒడ్డాణమును నీకు ప్రీతితో అలంకరింపచేస్తున్నట్టుగా భావిస్తున్నానమ్మా, స్వీకరించు తల్లీ!


సర్వాంగేఘనసారకుంకుమఘనశ్రీగంధపకాంకితం
కస్తూరీతిలకంచ ఫాలఫలకే గోరోచనాపత్రకమ్ ।
గండాదర్శనమండలే నయనయోర్దివ్యాంజనం తేంచితం
కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతామ్ ॥ ౭॥

ఓ మీననేత్రీ!
ఇదిగో ఘనమైన కుంకుమ పువ్వుతో కూడిన శ్రీగంధలేపనం నీకు ఆపాదమస్తకము అలంకరింపజేస్తున్నాను. సుగంధభరితమైన కస్తూరికొమ్ముతో చేయబడిన తిలకాన్ని నీ నొసట దిద్దుచున్నాను, దివ్య అంజనముతో నీ కన్నులకు కాటుకను దిద్దుతున్నాను, నీ కంఠానికి సుగంధ భరితమైన కస్తూరిజింక నాభిమామలాన్ని అలంకరింపజేస్తున్నాను, ఇవన్నీ నాభావనతో
సమర్పిస్తున్నాను. ఇదంతా నీకు సంతుష్టిని కల్గించుగాక!


కల్హారోత్పలమల్లికామరువకైః సౌవర్ణపంకేరుహై-
ర్జాతీ చంపకమాలతీవకులకైర్మందారకుందాదిభిః ।
కేతక్యా కరవీరకైర్బహువిధైః క్లుప్తాః స్రజో మాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే సంతుష్టయే గృహ్యతామ్ ॥ ౮॥

ఓ కోమలీ!
చక్కగా వికసించిన ఎ ర్రని కలువలు, మల్లెలు, మరువము, బంగారు తామరపూలు, జాజులు, సంపంగులు, (చంపకాలు), మాలతీ, వకులము, మందారం, కుంద పుష్పములు, మొల్లలు, మొగలి పువ్వు, ఎర్రగన్నేరుమొదలగు| వివిధ రకములైన పుష్పాలతో దండలు గుచ్చి నాభావనతో నీకు సమర్పించుచున్నాను. వరములనిచ్చు ఓ తల్లీ| సంతోషముగా స్వీకరించుము.


హంతారం మదనస్య నందయసి యైరంగైరనంగోజ్జ్వలై-
ర్యైర్భృంగావలినీలకున్తలభరైర్బధ్నాసి తస్యాశయమ్ ।
తానీమాని తవాంబ కోమలతరాణ్యామోదలీలా గృహా-
ణ్యామోదాయ దశాంగగుగ్గులుఘృతైర్ధూపైరహం ధూపయే ॥ ౯॥

ఓ దయామయీ!
తన మూడోకంటి జ్వాలతో మన్మధుణ్ణి ఆహుతి చేసిన శంకరునికి ఆనందాన్ని కలిగించు నటువంటివిన్నీ, మన్మధుణ్ణి తిరిగి పునర్జీవితుణ్ణి చేసినట్టివిన్నీ, తుమ్మెద రేకులవలె నిగనిగలాడుతూ, శృంగారంతో సమస్త సుగంధాలకూ ఆలవాలమై, పట్టు కుచ్చు వలె, అత్యంత మృదువుగా వున్న నీ శీరోజములకు పరిమళోపేతమైన దశాంగం గుగ్గులమును గోఘృతంతోను ధూపాన్ని సమర్పిస్తున్నాను. స్వీకరించు తల్లీ!


లక్ష్మీముజ్జ్వలయామి రత్ననివహోద్భాస్వత్తరే మందిరే
మాలారూపవిలంబితైర్మణిమయస్తంభేషు సంభావితైః ।
చిత్రైర్హాటకపుత్రికాకరధృతైఃగవ్యైర్ఘృతైర్వర్ధితై-
ర్దివ్యైర్దీపగణైర్ధియా గిరిసుతే సంతుష్టయే కల్పతామ్ ॥ ౧౦॥

శ్రీ మహాలక్ష్మీ!
లక్ష్మీ కళలతో దేదీప్యమానంగా వెలుగొందుచున్న నీ భవనంలో, మాలారూపముగా ఉన్న మణిమయ స్తంభాలలో, చిత్రంగా నిర్మించబడ్డ బంగారు బొమ్మల చేతులతో దివ్యమైన ఆవునేతి దీపమాలికలను సమర్పించుచున్నాను తల్లీ ! నీకు ఇది సంతుష్టిని కలుగజేయుగాక!


హ్రీంకారేశ్వరి తప్తహాటకకృతైః స్థాలీసహస్రైర్భృతం
దివ్యాన్నం ఘృతసూపశాకభరితం చిత్రాన్నభేదం తథా ।
దుగ్ధాన్నం మధుశర్కరాదధియుతం మాణిక్యపాత్రే స్థితం
మాషాపూపసహస్రమంబ సఫలం నైవేద్యమావేదయే ॥ ౧౧॥

హ్రీకారేశ్వరీ!
వేలకొలది నివేదనలు - బంగారు పళ్లెరాలలో కరిగించి పోసిన నెయ్యితో, పప్పుకూరలు, మాణిక్య పాత్రలలో నిండియున్న దివ్యాన్నము, చిత్రాన్నాము(పులిహోర), పాలు తేనె, నెయ్యి తో చేసిన పాయసాన్నము, చెక్కెరపొంగలి, పెరుగన్నము, గారెలు, బూరెలు, వేలకొలది వివిధ రకాల దివ్యమైన ఫలములతో (పండ్లు) కూడిన నైవేద్యాన్ని నీకు సమర్పిస్తున్నాను, జననీ స్వీకరించు!


సచ్ఛాయైర్వరకేతకీదలరుచా తాంబూలవల్లీదలైః
పూగైర్భూరిగుణైః సుగంధిమధురైః కర్పూరఖండోజ్జ్వలైః ।
ముక్తాచూర్ణవిరాజితైర్బహువిధైర్వక్త్రాంబుజామోదనైః
పూర్ణా రత్నకలాచికా తవ ముదే న్యస్తా పురస్తాదుమే ॥ ౧౨॥

ఓ కౌమారీ!
స్వచ్ఛమైన మొగలియాకుల కాంతితో సమానకాంతి గల లేత తమలపాకులకు మేలిమి ముత్యాలతో తయారు చేసిన తెల్లటి సున్నము పూసి, శ్రేష్టమైన వక్కపొడి, పచ్చకర్పూర మిశ్రితమైన సుగంధ ద్రవ్యాలు కలిపిన మిశ్రమాన్ని కూర్చి, పరిమళ భరితమైన తాంబూలాన్ని నీకు సమర్పిస్తున్నాను, అమ్మా స్వీకరించు, దీనితో రత్నములతో పొదగబడిన బంగారు కళాచికను(చిన్నపాత్రను) కూడా నీ ముందు ఉంచుతున్నాను తల్లీ! నీ తాంబూల శేషాన్ని మాకు ప్రసాదించడానికి.


(గమనిక: కామాక్షి అమ్మవారి త్యంబూల కబళ్ళాన్ని గ్రహించిన తరువాత కదా శ్రీ మూక శంకరేంద్ర సరస్వతీ స్వామివారు మూకపంచశతి రచించియున్నారు! అందుకే మనము కూడా అమ్మవారి తాంబూల శేషము ప్రసాదముగా పొందుటకై అమ్మవారి చెంత కళాచికను ఉంచవలెను)


కన్యాభిః కమనీయకాంతిభిరలంకారామలారార్తికా
పాత్రే మౌక్తికచిత్రపపంక్తివిలసద్కర్పూరదీపాలిభిః ।
తత్తత్తాలమృదంగగీతసహితం నృత్యత్పదాంభోరుహం
మంత్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతామ్ ॥ ౧౩॥


ఓ కళావతీ!
కమనీయమైన కాంతితో తేజరిల్లే కన్యలచే అత్యద్బుతముగా అలంకరించిన హారతి పళ్లెరాలలో ముత్యాలతో అలంకరించిన ముగ్గుల మధ్య కర్పూర దీపాలను ప్రజ్వలింపజేసి, తాళమృదంగ గీత నృత్యాలతో, వేదమంత్రాలతో తల్లీ నీకు నీరాజనం అర్పించుచున్నాను, స్వీకరించువమ్మా!


లక్ష్మీర్మౌక్తికలక్షకల్పితసితచ్ఛత్త్రం తు ధత్తే రసా-
దింద్రాణీ చ రతిశ్చ చామరవరే ధత్తే స్వయం భారతీ ।
వీణామేణవిలోచనాః సుమనసాం నృత్యంతి తద్రాగవ-
ద్భావైరాంగికసాత్త్వికైః స్ఫుటరసం మాతస్తదాకర్ణ్యతామ్ ॥ ౧౪॥

ఓ భువన జననీ!
లక్ష్మీ ప్రదమైన లక్షలాది ముత్యములతో కల్పించిన శ్వేత ఛత్రాన్ని నీకు సమర్పిస్తున్నానమ్మా! ఇంద్రాణియైన శచీదేవి మరియు రతీదేవి ఇరువైపులా నీకు చామరాలు వీచుచున్నారమ్మా, సరస్వతీ దేవి వీణాగానం చేయుచుండ, అప్సరసలు మధుర కంఠముతో వివిధ నృత్య భంగిమలతో మహిషాసురమర్దనాది నీ దివ్యలీలలను భావయుక్తముగా ప్రదర్శిస్తున్నారు, ఆలకించు తల్లీ!


హ్రీంకారత్రయసంపుటేన మనునోపాస్యే త్రయీమౌలిభి-
ర్వాక్యైర్లక్ష్యతనో తవ స్తుతివిధౌ కో వా క్షమేతామ్బికే ।
సల్లాపాః స్తుతయః ప్రదక్షిణశతం సంచార ఏవాస్తు తే
సంవేశో నమసః సహస్రమఖిలం త్వత్ప్రీతయే కల్పతామ్ ॥ ౧౫॥

ఓ వేదజననీ!
వేద శీర్షాలైన ఉపనిషత్తుల విచారణ ద్వారా లక్ష్యమైయే అంబా! నిన్నెవరు స్తుతించగలరమ్మా! నా సల్లాపాలు నీ స్తోత్రాలుగా, నా సంచార సర్వస్వం నీకు అసంఖ్యాక ప్రదక్షిణలుగా మదీయాగణిత సంకల్పాలే నీ ధ్యానముగా స్వీకరించు తల్లీ!


శ్రీమంత్రాక్షరమాలయా గిరిసుతాం యః పూజయేంచేతసా
సంధ్యాసు ప్రతివాసరం సునియతస్తస్యామలం స్యాన్మనః ।
చిత్తాంభోరుహమంటపే గిరిసుతా నృత్తం విధత్తేరసా-
ద్వాణీ వక్త్రసరోరుహే జలధిజా గేహే జగన్మంగలా ॥ ౧౬॥


ఫలస్తుతి

ప్రతినిత్యమూ సాయంసమయమున నిర్మలమైన సుస్థిరమైన చిత్తముతో గిరిరాజనందిని యగు జగదంబను హృదయములో నిలుపుకొని శ్రీ మంత్రాక్షరమాలచే మానసికంగా పూజించే వారి హృదయా రవిందాలలో పరదేవత నృత్యం చేస్తుంది. వారి వాక్కులో సరస్వతియు, గృహసీమలో జగన్మంగళ అయిన శ్రీ మహాలక్ష్మియు తాండవం చేస్తారు!


ఇతి గిరివరపుత్రీపాదరాజీవభూషా
భువనమమలయంతీ సూక్తిసౌరభ్యసారైః ।
శివపదమకరందస్యందినీయం నిబద్ధా
మదయతు కవిభృంగాన్మాతృకాపుష్పమాలా ॥ ౧౭॥


ఈ మంత్రమాతృకా పుష్పమాల - జగజ్జనని పాదారవిందానికి అందెగాను, జ్ఞాన సుగంధముచే విశ్వాన్నంతటిని స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచేటట్లుగా, పరమశివుని చరణ కమలాలయందు అచంచల భక్తిని ప్రసాదించేదిగాను, జ్ఞానులైన కవీశ్వరులందరికీ ఆనందాన్ని ప్రసాదించేదిగాను అగుగాక!


ఇతి శ్రీమచ్ఛఙ్కరభగవత్పాదవిరచితః
మన్త్రమాతృకాపుష్పమాలాస్తవః సమ్పూర్ణః ॥


ఈ భావము నేను సేకరించి రాసినది. నాది కాదు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మా అమ్మ

99. పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ